Sakshi Vaidya | సాక్షి వైద్య.. ఇన్‌స్టాగ్రామ్‌తో మొదలైన ప్రయాణమే ఆమెను గ్లామర్ ప్రపంచానికి తీసుకొచ్చింది. ఈ ముద్దుగుమ్మ రెండు సినిమాల అనుభవంతోనే.. పక్కా ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తున్నది. స్క్రిప్ట్‌కే నా మొదటి ప్రాధాన్యం అంటున్నది కూడా. చదవండి మరి.. సాక్షి వైద్య కార్వాన్ కబుర్లు..
నేను మహారాష్ట్రలోని థానేలో పుట్టాను. అమ్మానాన్నలకు ఒక్కదాన్నే. మూడేండ్ల క్రితం వరకూ నా జీవితం మరోలా ఉండేది. షార్ట్ వీడియోస్ తీసి నా ఇన్‌స్టా పేజ్‌లో పెట్టుకునేదాన్ని. అదో ప్రపంచం. అందులోనే ఆనందం వెతుక్కునేదాన్ని. అప్పుడే నా స్నేహితులు ‘సినిమాల్లో ఎందుకు ప్రయత్నించకూడదు?’ అని సలహా ఇచ్చారు. అంతలోనే కొవిడ్ సీజన్ మొదలైంది. చాలా నిర్మాణ సంస్థలు ఆన్లైన్లోనే స్క్రీన్ టెస్ట్‌లు జరిపేవి. ఇంట్లో తెలియకుండా చాలా ప్రయత్నాలే చేశాను.
ఓరోజు పొద్దున్నే పరధ్యానంగా కూర్చున్నా. అంతలోనే ఫోన్ మోగింది. ఏదో కొత్త నంబరు. సాధారణంగా లిఫ్ట్ చేయను. అప్పుడు మాత్రం తీయాలనిపించింది. అవతల ఓ మగ గొంతు. తాను క్యాస్టింగ్ డైరెక్టర్‌నని పరిచయం చేసుకున్నాడు. ఓ తెలుగు సినిమాకు నన్ను ఎంపిక చేసినట్టు చెప్పాడు. అదే ‘ఏజెంట్. హీరో పేరు చెప్పగానే ఎగిరి గంతేశాను.. అఖిల్ అక్కినేని.
మొదటి సినిమాతోనే నాకు అభిమానుల్లో గుర్తింపు వచ్చింది. ఎక్కడికెళ్లినా పలకరిస్తున్నారు. హాయ్ చెబుతున్నారు. షూటింగ్ కోసం జార్జియా వెళ్లడం ఓ మంచి అనుభూతి. అమ్మకైతే ఇదంతా కలలా అనిపించింది. నేనేదో గొప్ప విజయం సాధించినట్టు మురిసిపోయింది. కన్న మమకారం కదా!
వరుణ్‌తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శక త్వంలో రాబోతున్న ‘గాండీవధారి అర్జున’ విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. సాయి ధరమ్తేజ్తోనూ ఓ సినిమా చేస్తున్నా. మెగా కాంపౌండ్ నుంచి ఇద్దరు హీరోలతో పనిచేయడం అంటే మాటలు కాదు.
ఓటీటీ గురించి చెప్పాలంటే.. ఇదో అవకాశాల ద్వారం. ఓ మ్యాజిక్ బాక్స్. వీక్షకులకువిందు భోజనం. కోరినన్ని సినిమాలు. నాకు కూడా ఓటీటీలో చేయాలని ఉంది. కానీ ఇప్పటి వరకూ అవకాశం రాలేదు. వస్తే మాత్రం.. ఓకే చేస్తా. మనల్ని మనం నిరూపించుకోడానికి ఓ మంచి చాన్స్.
నాకంటూ డ్రీమ్ రోల్స్ ఉన్నాయి. ఏదో ఒక రోజు అవన్నీ తప్పకుండా చేస్తాను. ‘బాజీరావ్ మస్తానీ’లో ప్రియాంక చోప్రా, ‘క్వీన్’లో కంగనా రనౌత్, ‘శ్యామ్ సింగరాయ్’లో సాయి పల్లవి.. చేస్తే ఇలాంటి పాత్రలే చేయాలి. కీర్తి సురేశ్ కూడా నాకు ఆదర్శమే. తను ఆచితూచి సినిమాలు ఎంచుకుంటుంది. స్క్రిప్ట్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తుంది. ప్రొఫెషనలిజం అంటే అదే.
“Sakshi Vaidya | ఫ్లాప్ అయితే ఏంటీ.. ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్య బిజీబిజీ”