దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటలకు సంబంధించిన షూటింగ్ జరుపుకుంటుంది. అక్టోబర్ 13న చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు. ప్రస్తుతానికి ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచుతూ సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల వీడియోలు విడుదలైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ వీడియో చివరలో భీమ్ పాత్రకు ముస్లిం టోపీ ధరింపజేశారు. దీనిపై చరిత్రకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భీమ్ వారసులు సైతం ఈ విషయంపై మండి పడ్డారు. అయితే ఎన్టీఆర్‌కి టోపీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో విజయేంద్ర ప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఓ ఆంగ్ల మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘‘భీమ్‌ను పట్టుకోవాలని నైజాం ప్రభువులు ప్రయత్నించారు. వెంటాడారు. నైజాం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ముస్లిం యువకుడిగా మారాడు’’ అని అన్నారు విజయేంద్ర ప్రసాద్. ఇక అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న చరణ్ పోలీస్ గెటప్‌లో కనిపించడానికి కూడా ఓ కారణం ఉందని, దానిని వెండితెరపై చూశాక చాలా థ్రిల్ అవుతారని చెప్పుకొచ్చారు ఈ ఫేమస్ రచయిత.