అసలు హంతకుడు ఫారెస్ట్ కాంట్రాక్టర్ రావు గారే! లేదు.. ఆ జేమ్సే హత్యలన్నీ చేస్తున్నది. బండి నడిపే సూరన్న… గుండెలు తీసిన బంటు! వీళ్లెవరూ కాదహే.. పులి.. పులే మనుషులందరినీ పొట్టన పెట్టుకుంటున్నది. ఇంతకూ అసలు హంతకుడు ఎవరు? 1985 మే 22న మొదలైన ‘అన్వేషణ’.. నేటికీ చిక్కగానే ఉంది! వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తెలుగు వెండితెరకు కొత్త కిక్కు ఇచ్చింది. ఈ సినిమా ఇప్పటికి ఎన్నిసార్లు చూసినా.. అసలు హంతకుడు ఎవరో తెలిసినా.. మళ్లీ చూస్తుంటే వీరందరిపై అనుమానం కలుగుతుంటుంది. అందుకే నాలుగు దశాబ్దాలు పూర్తిచేసుకున్నా.. అంతు‘చిక్కని అన్వేషణ’గా ఆదరణ పొందుతూనే ఉంది.
Anveshana | సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు స్తబ్ధుగా సాగుతుంటాయి. స్లో మోషన్తోనే ఎమోషన్స్ పండిస్తుంటారు దర్శకులు. మాటలు పొదుపుగా ఉంటాయి. పాటలు ఉన్నా.. అంతగా ఆకట్టుకునేలా ఉండవు. అప్పటివరకు తెలుగు తెరపై సస్పెన్స్ థ్రిల్లర్స్ జానర్ ఫార్ములా ఇలాగే ఉండేది. సంగీతం, సాహిత్యం, లైటింగ్, టేకింగ్ అనే ఉత్ప్రేరకాలతో ఓల్డ్ థ్రిల్లర్ సినీ ఈక్వేషన్‌ను పూర్తిగా మార్చేశాడు వంశీ.
టైటిల్ కార్డ్స్ నుంచి ఎండింగ్ వరకు అదే ఇదిగా సస్పెన్స్ కొనసాగిన సినిమా ఇది. వడివడిగా సాగుతుంది. వేడివేడిగా అనిపిస్తుంది. వంశీ అప్పటికి చేసింది రెండు సినిమాలే. మొదటిది మంచుపల్లకి. హృద్యమైన కథ. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.
రెండోది సితార. ఆయనే రాసిన నవల ‘మహల్లో కోకిల’ ఆధారంగా తెరకెక్కింది. దానికి సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం తోడైంది. వంశీ టేకింగ్ ఎట్లా ఉంటుందో ఇండస్ట్రీకి తెలిసింది. రీ రికార్డింగ్‌కు ముందు సినిమా చూసిన ఇళయరాజా నాలుగైదు రీళ్ల తర్వాత వంశీని పిలిచి ‘చాలా బాగా తీశావ్’ అన్నాడట. తను నచ్చే సంగీత దిగ్గజం ఆ మాట అనడంతో వంశీ మనసు ఎగిరి గంతేసిందట!
ముచ్చటగా మూడో సినిమాకు రంగం సిద్ధమైంది. వంశీ అప్పటికింకా కథేం అనుకోలేదు. సస్పెన్స్ థ్రిల్లర్ తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మెదిలింది. అదే విషయం నిర్మాతకు చెప్పాడు. ‘మీరెలాగంటే అలాగ.. బడ్జెట్ మాత్రం మేమెలాగంటే అలాగ’ అన్నాడట నిర్మాత కామినేని ప్రసాద్.
‘ఒక అమ్మాయి అడవిలో ఏదో పరిశోధన చేస్తుంటుంది.. ఆమెను కొందరు వెంబడిస్తుంటారు ఇదీ స్టోరీలైన్’ అని చెప్పాడట వంశీ. నిర్మాతకు భలేగా నచ్చింది. ప్రపంచంతో తక్కువగా, ప్రకృతితో ఎక్కువగా మమేకమయ్యే వంశీ.. కథా విస్తరణ కోసం అరకు వెళ్లాడు. అక్కడి పచ్చని ప్రకృతి ఒడిలో.. అందమైన కుటీరంలో దిగాడు. కథను దాదాపు ముగించేశాడు. మ్యూజిక్ సిట్టింగ్స్‌కు రమ్మంటూ ఇళయరాజా నుంచి కబురొచ్చింది. హడావుడిగా మర్నాడే బయల్దేరాడు.
మ్యూజిక్ సిట్టింగ్స్ నాడు.. కథ రాసిన కాగితాల ఫైల్ కోసం పెట్టె తెరిచాడు వంశీ. ఫైల్ అందుకున్నాడు. అందులో కథలేదు. అరకు గెస్ట్‌హౌజ్ తాలూకు ఏవో కాగితాలున్నాయి. పక్క గదిలో ఇళయరాజా హార్మోనియం పెట్టె ముందేసుకొని ఆల్రెడీ సెటిలయ్యాడు. కథ ఉన్న ఫైల్‌ను అరకు అతిథి గృహంలోనే మర్చిపోయి వచ్చానని వంశీకి అప్పటికి బోధపడింది. తాను రాసిన కథే అయినా.. సాంగ్ సిట్యుయేషన్స్, కథలో మలుపులు ఇవేవీ ఆయనకు గుర్తుకు రావడం లేదు. ఏదో ధైర్యం చేసి మ్యూజిక్ డైరెక్టర్ ముందుకు వెళ్లాడు. మనసు పొరల్లోంచి వెలికి తీసి సందర్భాలు గుర్తున్నంత వరకు చెప్పాడు. ఒక్కో ట్యూన్ సిద్ధమైపోయింది.
ఆల్రెడీ రాసిన కథను.. ఎంత గుర్తు చేసుకున్నా వంశీకి అరకులో తట్టినంత చిక్కగా రావడం లేదనిపించింది. మళ్లీ పూనుకొన్నాడు. ఏదో పూనకం వచ్చినట్టయింది. ఎడాపెడా రాసేశాడు. అనుకున్న సమయానికల్లా స్క్రిప్ట్ సిద్ధమైంది. వెండితెర నవల శైలిలో వచ్చిందా స్క్రిప్ట్. దాన్ని చదివిన వారంతా.. ‘సినిమా హిట్టయ్యాక కొన్ని సినిమాలకు వెండితెర నవల రూపం ఇస్తారు.. మీరు ముందే రాసేశారు’ అన్నారట. కథ కుదిరింది. మ్యూజిక్ అదిరింది. కథానాయికగా భానుప్రియ ఎంపికైంది. హీరో కొత్త ముఖం కావాలన్నాడు వంశీ. ‘సీతాకోకచిలుక’లో నటించిన మురళి (కార్తిక్) అనుకున్నారు. మిగతా పాత్రలకు నటీనటుల ఎంపిక పూర్తయింది.
తలకోనలో షూటింగ్ మొదలైంది. అడవిలో సాగే అన్వేషణ అది. ఫారెస్ట్ కాంట్రాక్టర్ రావు (సత్యనారాయణ)కు సంగీతం అంటే ప్రాణం. రాగాలన్నీ.. శుకపికముల కలరవములే అని ఆయన ప్రగాఢ నమ్మకం. ఈ విషయంపై ఉద్గ్రంథం రాయాలనుకుంటాడు. పరిశోధనలు చేస్తాడు. ఆ పనిని పూర్తి చేయడానికి తన స్నేహితుడి కుమార్తె హేమ (భానుప్రియ)ను అడవికి రప్పిస్తాడు! రావు మార్గనిర్దేశనంలో హేమ పరిశోధనలు ప్రారంభిస్తుంది. వనమంతా వసంతంలా విహరిస్తూ.. పక్షుల కిలకిలల్ని రికార్డు చేస్తుంటుంది. ఆ విహంగ గీతాలను భగ్నపరుస్తూ అడపాదడపా పులి గాండ్రింపులు. మనుషుల రక్తం మరిగిన పులి ఏ డొంకలోంచి మీద పడుతుందో అని అందరిలో జంకు. హేమకు పులి అంటే భయం లేదు. కానీ, తనను వెంటాడుతున్న ముగ్గురు ముసుగు మనుషుల గురించే ఆమె ఆందోళన. రావు మేనేజర్ గోఖలేను పులి చంపేస్తుంది. అతని స్థానంలోకి వస్తాడు అమర్ (కార్తిక్). పులి పేరుమీద మనుషులను చంపుతున్న మేకవన్నె పులుల్లాంటి మనుషుల కోసం అతను అన్వేషిస్తుంటాడు. ఈ క్రమంలో అమర్‌కు అందరిమీదా అనుమానం తలెత్తుతుంది. ప్రేక్షకులకూ అవే అనుమానాలు రేకెత్తుతాయి.
షూటింగ్ టైమ్‌లో ఒకసారి సత్యనారాయణ దర్శకుడు వంశీని పిలిచి.. ‘నువ్వు ఏం తీస్తున్నావో అప్పుడప్పుడూ అర్థం కావడం లేదయ్యా! కానీ, ఏదో గొప్పగా తీస్తున్నావని మాత్రం అనిపిస్తున్నది’ అన్నాడట. అందుకు కారణమూ లేకపోలేదు. రావు పాత్రను చాలా జోవియల్‌గా చూపించిన వంశీ.. అక్కడక్కడా కాస్త కన్నింగ్ లుక్స్ ఇవ్వమనడమే సత్యనారాయణకు అంతుపట్టలేదు. సినిమా క్లయిమాక్స్ వరకూ మనకూ అంతుచిక్కదు. జేమ్స్ ఏమో పైకి పులి కోసం అన్వేషిస్తుంటాడు. అడవిలో అడుగుపెట్టిన అమర్ ఎవరనేదే అతని అసలైన అన్వేషణ. రావు ఇంట్లో పనివాడైన పాండు (రాళ్లపల్లి) కూడా ఏదో అన్వేషిస్తున్నట్టు కనిపిస్తాడు. ఇవి చాలవన్నట్టు.. ఓ మూడు జతల కాళ్లు అడవంతా పరుగులు తీస్తూ హేమను అన్వేషిస్తుంటాయి. ముసుగులు వేసుకున్న ముగ్గురిని మరో జత బూట్లు వెంబడిస్తుంటాయి. ఈ నలుగురినీ కనిపెట్టడమే హీరో అసలు అన్వేషణ!
ఈ సినిమాలో నవ్వులు పండించిన పాత్ర పులిరాజు. ఈ రోల్ కోసం రావుగోపాల్రావును తీసుకుందామని వంశీ ఆలోచన. కానీ, కుదరలేదు. చివరికి తన చుట్టూ వేషాల కోసం తిరుగుతున్న మల్లికార్జునరావును పులిరాజును చేశాడు. పులిరాజు భార్యగా వై.విజయ చూపులు మత్తెక్కిస్తాయి. పులిరాజు బావమరిదిది తరచూ పులిని చూశానంటూ ఆందోళన పడుతుంటాడు. జేమ్స్, పులిరాజు భార్య రహస్యంగా కలుసుకునే మంచె దగ్గరికి ఎవరూ రావొద్దనే ఎత్తుగడ అతనిది. పులిరాజు కొడుకుగా శుభలేఖ సుధాకర్ అమాయక పాత్రలో కనిపిస్తాడు. ఎడ్లబండి సూరన్న (థమ్) అడపాదడపా తెరపైకి వస్తాడు. అనామక పాత్రలను కూడా సినిమాలో ఎంత కీలకంగా వాడుకోవచ్చో.. వంశీ నిరూపించిన సినిమా అన్వేషణ.
హేమ కన్నా ముందు ఇదే అడవికి పరిశోధన కోసం వచ్చిన సుమతి (పొన్ని)ని పులి పొట్టన పెట్టుకుందని అందరి మాట. కానీ, ఆమెను వెంటాడి, వేటాడింది మనుషులే అన్న అమర్ అన్వేషణ.. హేమ సహకారంతో కొలిక్కి వస్తుంది. ఈలోపు అనుమానితులు ఒక్కొక్కరూ చనిపోతుంటారు. అన్ని చావులూ పులి ఖాతాలో చేరుతుంటాయి. కానీ, పులి చంపలేదని ప్రేక్షకులకు తెలిసిపోతుంటుంది. మరి చంపుతున్నదెవరు? ఆ సస్పెన్స్ అలాగే కంటిన్యూ అవుతుంది. క్లయిమాక్స్ చూశాక ‘ఇదిరా థ్రిల్లర్ అంటే’ అని అనకుండా ఉండలేరు.
ఆ మనుషులను చంపింది రావు కాదు. రేంజ్ ఆఫీసర్ జేమ్స్ కూడా కాదు. పులి.. అంతకన్నా కాదు. జేమ్స్‌ను, గోఖలేను, ఎడ్లబండి సూరన్నను, పులిరాజు కొడుకును ఈ అందరినీ చంపింది పాండు.
సినిమా ఎన్నిసార్లు చూసినా.. క్లయిమాక్స్లోనే ఈ విషయం మనకు రిజిస్టర్ అవుతుంది. తెలిసిన నిజాన్ని విస్మరిస్తూ.. వంశీ క్రియేట్ చేసిన సస్పెన్స్‌లో కూరుకుపోతారు ప్రేక్షకులు. దటీజ్ వంశీ మార్క్ టేకింగ్. అందుకే నలభై ఏండ్లయినా.. ‘అన్వేషణ’కు ఆదరణ అంతే ఇదిగా ఉంది. కావాలంటే ఇంకోసారి చూడండి. ఇంత చదివాక కూడా.. పాండు మీద కన్నా… ఇతర పాత్రల మీదే మీకు అనుమానం మళ్లీ కలుగుతుంది. మీ అన్వేషణ సినిమా కడదాకా కొనసాగుతూనే ఉంటుంది.
ఈ సినిమాకు కథతోపాటు మాటలు అందించింది వంశీనే! పాటలు రాసింది వేటూరి. పాడింది బాలు, జానకి. చిత్రంలో అన్ని పాటలూ ఎవర్గ్రీన్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నవే.
వంశీ, ఇళయరాజా కాంబినేషన్లో ఇది రెండో సినిమానే! అప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘సితార’ మ్యూజికల్‌గా కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ‘అన్వేషణ’ పాటలు కూడా ఆ రేంజ్లో విజయం సాధించాయి. హాలీవుడ్ టేకింగ్‌ను మరిపించిన ‘అన్వేషణ’లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మహాగొప్పగా ఉంటుంది. సినిమా సక్సెస్‌లో ఇసైజ్ఞాని వాటా ఎంతో ఉందనిపిస్తుంది. అయితే రీ రికార్డింగ్‌కు ముందు సినిమా చూసిన ఇళయరాజా.. గమ్మనకుండా ఇంటికి వెళ్లిపోయారట. ‘సితార’ చూసి తెగ మెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు ఏం మాట్లాడకపోవడంతో తనలో తాను నొచ్చుకున్నాడట వంశీ. ఆయనకు సినిమా నచ్చలేదేమో అనుకున్నాడట.
మర్నాడు రికార్డింగ్ టైమ్‌లో ఆర్కెస్ట్రాకు అన్ని నోట్స్ ఇచ్చి.. బయటికి వెళ్తున్న ఇళయరాజా.. వంశీని కూడా రమ్మన్నాడట! అలా ఇద్దరూ వెళ్లి ఓ ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంట్లోంచి ఓ పెద్దమనిషి బయటికి వచ్చి రాజాతో మాట్లాడుతూ.. ‘ఎవరీ కుర్రాడు’ అన్నాడట. అప్పుడు ఇళయరాజా.. ‘రాత్రి నీకు ఫోన్లో చెప్పా కదా అన్నా! ఒక తెలుగు కుర్రోడు.. ఒక సస్పెన్స్ సినిమా ఇంగ్లిష్ సినిమాలా తీశాడని.. ఆడే ఈడు’ అన్నాడట. ఆ మాటతో వంశీ మనసులో అప్పటిదాకా కొనసాగిన అన్వేషణ ఆనంద తాండవం చేసిందట.