హీరో అంటే.. ఒడ్డూపొడుగూ ఉండాలి. ముక్కూమొహం బాగుండాలి. నిమ్మపండు మేనిఛాయ మస్ట్. పొడగరి కాకపోయినా, విశాల నేత్రాలు లేకపోయినా.. రంగుంటే చాలు! ఇదీ హీరోల ఎంపికలో సినీజనాల ఈక్వేషన్! కాస్త రంగు తక్కువ ఉన్నోళ్లు.. అవకాశాల కోసం సినిమా ఆఫీసుల తలుపు తడితే.. ‘ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?’ డైలాగ్ పరిపాటి. కానీ, ఫెయిర్ కలర్ ఫార్ములా వర్కవుట్ కావడంలేదు. రంగు లేకున్నా.. టాలెంట్ ఉంటే చాలంటున్నారు. కలర్ తక్కువున్నా కాలర్ ఎగరేసుకొని.. సక్సెస్ సాధిస్తున్న నటులు ఎందరో ఉన్నారు.
Tollywood | యస్.. మడిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి.. లేపోతే.. మనిషికీ గొడ్డుకూ తేడా ఏటుంటాదీ! ఈ డైలాగ్ దశాబ్దాల కాలం ముందు రాసిందే. కానీ, ఇప్పుడు ఇదో ట్రెండింగ్ ఫార్ములాగా నేటి మన తెలుగు సినీ రంగానికి అన్వయించుకోవచ్చు. తమిళనాడులో తలైవా రజనీ ఈ ఫార్ములా ఎప్పుడో ప్రూవ్ చేసి చూపించాడు. తర్వాత ధనుష్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేటి జనరేషన్‌కి ఓ ప్రేరణ. వీరితోపాటు కోలీవుడ్‌లో మరెందరో మాణిక్ బాషాని ఫాలో అయ్యారు. మంచి మాస్ ఫాలోయింగ్‌తో స్టార్లుగా ఎదిగారు. ఇప్పుడీ ట్రెండ్ మన టాలీవుడ్‌లోనూ పీక్స్‌కి చేరింది. ఎందుకంటే.. మన కథల్లో ఇప్పుడిప్పుడే రజనీలా నల్ల బంగరాలు మెరుస్తున్నారు. హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ గానో… మెయిన్ విలన్ పక్కన కామెడీ విలన్ గానో.. పక్కింటి అంకుల్ని ఏడిపించే జులాయిగానో.. అయితే పెద్ద విశేషం ఏం ఉంటుంది. హీరోలుగానే మెప్పిస్తున్నారు. హీరోయిన్‌తో డ్యూయెట్ పాడుతున్నారు. అంతేకాదు.. ఈ కుర్రోడు హీరో ఏంట్రా అని మాట్లాడే వాళ్లకి స్ట్రాంగ్ గానే సమాధానాలు ఇస్తున్నాడు. ఇంకొందరు.. సోషల్ మీడియా స్టార్లుగా ఎదుగుతున్నారు. వెబ్ సిరీస్‌లు చేస్తూ మిలియన్ల వ్యూస్‌తో ఫ్యాన్ బేస్ పెంచుకుంటున్నారు. ఒకరిని హీరోని చేసేవి ఒడ్డు, పొడుగు, రంగు, రూపం కాదు.. హార్డ్‌వర్క్, సిన్సియారిటీ, టాలెంట్, డిసిప్లిన్ మాత్రమే అని నిరూపిస్తున్నారు.
కామెడీ టైమింగ్ అంటే సునీలే. సౌండ్ చేసినా, చిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చినా.. నవ్వులే నవ్వులు. హీరో దోస్తుగా పంచ్‌లు వేసిందీ, మర్యాదరామన్నలా ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించిందీ.. సిక్స్ ప్యాక్స్‌తో ఔరా అనిపించుకుందీ, పుష్పలో ఫైర్ అయిందీ సునీల్ వర్మే. ఇంత నల్లగా ఉన్నాడు.. ఇతణ్ని ఎవరు చూస్తారని అవమానించిన తెలుగు సినీ పరిశ్రమలోనే చెరగని ముద్ర వేశాడు. ఇక ఇప్పుడు అదే బాటలో హీరోగా ఎదుగుతున్నాడు సత్య. జూనియర్ సునీల్ అనిపించుకున్నాడో లేదో.. నాన్ స్టాప్‌గా సినిమా ఆఫర్లు పట్టేస్తున్నాడు. హీరోకి సమానంగా సీన్లు. ఈ బ్లాక్ హార్స్ టైమింగ్‌ని అందుకోవడానికి హీరోలే కష్టపడే పరిస్థితి. అందుకు సాక్ష్యమే ‘రంగబలి’. దీంట్లో హీరో నాగశౌర్యతో కలిసి కామెడీ పండించిన విధానం చూస్తే సత్య టైమింగ్ స్టామినా అర్థం అవుతుంది. టీవీ కామెడీషోతో మొదలైన సత్య జర్నీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా.. ఆ తర్వాత కమెడియన్‌గా.. ఇప్పుడు హీరోగా కొనసాగుతున్నది. థియేటర్లలో సందడి చేస్తున్న ‘మత్తు వదలరా2’లో తన విశ్వరూపం చూపించాడు. అందంతోనో.. ఆహార్యంతోనో కాదు.. తన హావభావాలతో ప్రేక్షకులకు ‘చిల్’పిల్ వేశాడు. పంచ్లోనే కాకుండా.. తన డ్యాన్స్ మూమెంట్.. ఫైట్లు.. సినిమాకి లైఫ్‌గా మార్చేశాడు. ఇంతకంటే ఏం కావాలి.. ఓ నటుణ్ని నియంత్రిచేది రంగు కాదని చెప్పడానికి!
అతణ్ని చూస్తే మన పక్కవీధిలో కుర్రాడిలా కనిపిస్తాడు. అతనే సుహాస్. యూట్యూబ్‌తో కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోకి ఫ్రెండుగా.. వీడు మన దోస్త్లానే ఉన్నాడే అనిపించుకున్నాడు. పెద్ద ఆలస్యం చేయకుండానే ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూనే మరోవైపు హీరోగా నటించి విజయాలను అందుకున్నాడు. అతని నేచురల్ నటనకు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ‘అంబాజీపేట మ్యారేజీబ్యాండు’, ‘జనక అయితే కనక’ చిత్రాలతో ప్రేక్షకుల మదిని దోచేశాడు. ఇప్పుడు గొర్రెని హీరోగా చేసి భిన్నమైన పాత్రతో థియేటర్లతో సందడి చేస్తున్నాడు. అయినా.. దేవుడిచ్చిన రంగుపై సుహాస్‌కు కామెంట్స్ తప్పలేదు. కానీ.. తనకి తెలిసింది నటించడం. ‘కలర్ ఫొటో’తో హీరోగా మారిన సుహాస్ ఇప్పుడు చిన్నసినిమాల బాక్సాఫీస్ ఈక్వేషన్స్‌ను సరిచేసే స్థాయికి ఎదిగాడు.
‘నా చావు నేను చస్తా’ అనే ఒక్క డైలాగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి. వరుస విజయాలు వరిస్తున్నా.. తన నటనకు రంగు అవరోధంగా మారిందని పలు సందర్భాల్లో చెప్పాడు. మొదట్లో ఇలాంటి అవమానాలెన్నో అనుభవించానని తెలిపాడు. ‘ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు నల్లగా, సన్నగా ఉన్నాడు, మొటిమలు ఎక్కువ ఉన్నాయి. హీరో కంటే పొడుగ్గా ఉన్నాడు అనే వాళ్లు. అలా అన్నప్పుడల్లా నన్ను నేను ప్రొత్సహించుకునే వాడిని…’ అని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు దర్శి. పెద్ద హీరోలతోనూ కలిసి నవ్వుల్ని పంచుతూ.. ఆరోగ్యకరమైన కామెడీని ఇస్తూ అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘మల్లేశం’ సినిమాలో తన అభినయంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక బలగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్‌లతో మొదలైన తన కెరీర్.. ఇప్పుడు జోష్‌ఫుల్‌గా సాగుతున్నది.
‘కర్రెగా ఉన్నాడా? తెల్లగా ఉన్నాడా’ అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ టాలెంట్ ముఖ్యం. ‘అరే వీడు హీరోనా? వీడేంటి మస్త్ కర్రెగా ఉన్నాడు? హీరో ముఖం కాదు.. వేస్ట్ మెటీరియల్’ అని చాలా అన్నారు. నేను ఇలానే పుట్టాను. ఇలానే ఉంటా. ఒక మనిషి సక్సెస్ డిసైడ్ చేసేది నలుపు, తెలుపు, అందం కాదు బ్రదర్. ఆ మనిషి హార్డ్‌వర్క్, టాలెంట్. వాటినే ఇండస్ట్రీ నమ్మేది’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ప్రముఖ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్. తనపై వచ్చిన కామెంట్స్‌కి చాలా బోల్డుగా స్పందించాడు. ‘బబుల్ గమ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోషన్ యాక్టర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తన రెండో సినిమా ‘మోగ్లీ’తో ముందుకు వచ్చేస్తున్నాడు. ఎంత పెద్ద సెలెబ్రిటీల పిల్లలకైనా రంగు దెబ్బ తప్పడం లేదు. రోషన్ చెప్పినట్టు టాలెంట్ ఒక్కటే కొలమానం అని అంగీకరించకతప్పదు.
విజయ్ సేతుపతి సౌత్ ఇండియా విలక్షణ నటులలో ఒకరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యాడు. హీరో అంటే ఇలానే ఉండాలి అనే బౌండరీలు చెరిపేసి.. ఎవరైనా హీరో కావచ్చని రుజువు చేశాడు. విశాల్ సంగతి సరేసరి! కలర్ తక్కువున్నా.. మనోడి కటౌట్ పెద్దదే!! తమిళ సినిమాల్లో కమెడియన్ యోగిబాబు ఇంకా అదుర్స్. రోజుకి రెండు వేలు రెమ్యునరేషన్ తీసుకున్న యోగి కాల్షీట్ కాస్టు ఇప్పుడు రూ.10 లక్షల పైమాటే. ఈ స్టార్ కమెడియన్ సోలో హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. యోగిబాబు సినిమాల్లోకి వచ్చి ఎంతో కాలం కాలేదు. ఒకప్పుడు అతని లుక్ చూసి చాలామంది నవ్వేవారట. ‘నీ అవతారం అంటూ.. బాడీ షేమింగ్ చేశారు. అయితే దీని గురించి పెద్దగా ఆలోచించలేదు. కామెడీకి బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యం. నేను దాన్ని వాడుకున్నాను. అంతేకాదు.. నన్ను ప్రోత్సహించిన వారూ ఉన్నారు’ అని యోగిబాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అన్నట్టూ.. ఇంకో విషయం, ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాతో యోగిబాబు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇలా చెబుతూపోతే తమిళంలో నల్ల బంగారాల లిస్ట్ పెద్దదే!!
– రాజేశ్ యడ్ల