కంచర్ల ఉపేంద్ర, అపర్ణాదేవి జంటగా రూపొందిస్తున్న చిత్రం ‘1920 భీమునిపట్నం’. నరసింహ నంది దర్శకుడు. కంచర్ల అచ్యుతరావు నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. బ్రిటీష్ ప్రభుత్వ పోలీస్ అధికారి పాత్రలో కంచర్ల ఉపేంద్ర నటిస్తుండగా, స్వాతంత్య్ర సమరయోధుని కుమార్తెగా హీరోయిన్ అపర్ణాదేవి కనిపించనుంది. వీరిద్దరిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కంచర్ల అచ్యుతరావు క్లాప్ ఇచ్చారు. ‘ఇది సీతారాం, సుజాత అనే ఓ జంట ప్రేమకథ.
1920నేపథ్యం కావడంతో ఆ రోజుల్ని గుర్తుచేసే సంగీతం ఉండాలనే ఉద్దేశంతో ఇళయరాజాగారిని కలిశాం. ఆయన కథ విని, ‘సినిమా చేస్తున్నాం’ అన్నారు. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తాం.’ అని నిర్మాత తెలిపారు. స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో చక్కటి భావోద్వేగాల మధ్య నడిచే కథ ఇదని, నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రేరణగా తీసుకొని ఈ కథ తయారు చేశానని దర్శకుడు పేర్కొన్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా ఇదని హీరో కంచర్ల ఉపేంద్ర అన్నారు.