Horror Films | భయపడటం చాలామందికి ఇష్టం. అందుకే భయపెట్టడం ఓ వ్యాపారమైంది. డబ్బిచ్చి మరీ భయాన్ని కొనుక్కునేవాళ్లు భూమ్మీద కోకొల్లలు. కొందరు క్రియేటివ్ జీనియస్‌లు జనాన్ని భయపెట్టడంలో రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. వాస్తవ ప్రపంచంలో జల్లెడ పట్టి వెతికినా కనిపించని ఆత్మలకు రూపాన్ని ఇచ్చేసి.. వాటిని ప్రేతాత్మలుగా మార్చేసి.. వాటితో విచిత్రమైన విన్యాసాలు చేయించేసి ఆడియన్స్‌ని భయపెట్టేస్తుంటారు. మాయా ప్రపంచంలో విహరించడంలో.. అడ్వెంచర్లను ఎక్స్పీరియన్స్ చేయడంలో ఆనందాన్ని వెతుక్కునే ప్రేక్షకదేవుళ్లు ఈ తరహా సినిమాలను తెగ ఆరాధించేస్తుంటారు… పనిలో పనిగా ఆదరించేస్తుంటారు. ఈ హారర్‌కు ఎక్కువ మోతాదులో కామెడీని యాడ్ చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు భయపడుతూనే పడిపడి నవ్వుతున్నారు.
ఇక రామ్‌గోపాల్‌వర్మ ఆగమనంతో భారత్‌లో హారర్ సినిమాల శకం మొదలైంది. ఆయన తీసిన తొలి హారర్ సినిమా ‘రాత్రి’ పెద్దగా ఆడకపోయినా.. ఈ జానర్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్ అయింది. రెండున్నర గంటలపాటు దెయ్యాన్ని చూపించకుండా కేవలం కెమెరాతోనే భయపెట్టాడు వర్మ. క్లయిమాక్స్‌లో దెయ్యాన్ని చూపిస్తాడు. నిజంగా టెర్రర్ పుట్టిస్తుందా సీన్. తెలుగులో రామ్‌గోపాల్‌వర్మ తీసిన మరో హారర్ సినిమా ‘దెయ్యం’. సినిమా బావుంటుంది. అయితే.. పతాక సన్నివేశాల విషయంలోనే వర్మ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. బాలీవుడ్లో ఆయన తీసిన ‘భూత్’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఏదేమైనా.. హారర్ సినిమాల ద్వారా హాలీవుడ్ టేకింగ్‌ని రామ్‌గోపాల్‌వర్మ భారతీయ సినిమాకు పరిచయం చేశాడు.
భయపెట్టే సినిమాల్లో ‘ఈవిల్ డెడ్’ ఓ మాస్టర్ పీస్. 1981 నుంచి 2023 వరకూ ఈ ఫ్రాంచైజీలో అయిదు సినిమాలొచ్చాయి. త్వరలో ఆరో సినిమా కూడా రాబోతున్నది. ‘ఈవిల్ డెడ్’కి పూర్వం కూడా హాలీవుడ్లో భయపెట్టే సినిమాలు చాలానే వచ్చాయి. కాకపోతే.. ‘ఈవిల్ డెడ్’ మాత్రం ఓ ట్రెండ్ సెట్టర్. ఇక మనదేశం విషయానికొస్తే.. ఈ తరహా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ రామ్సే బ్రదర్స్. హారర్ సినిమాలు తీయడంలో వీళ్లు మాస్టర్లు. వీరి దర్శకత్వంలో దర్వాజా, ఔర్ కౌన్, పురానామందిర్, దహ్శత్, విరానా, పురానీ హవేలీ, బంద్ దర్వాజా.. ఇలా చాలా హారర్ సినిమాలే వచ్చాయి. అవి తెలుగులో కూడా బాగా ఆడాయి.
70ల్లో కన్నడంలో అనంతనాగ్ హీరోగా వచ్చిన ‘నా నిన్న బిడలారె’ సినిమా.. తెలుగులో ‘గాయత్రి’ పేరుతో రిలీజై ఇక్కడి ప్రేక్షకుల కంటికి కునుకు లేకుండా చేసింది. ఈ సినిమా ప్రేరణగా తర్వాత చాలా హారర్ సినిమాలొచ్చాయి. హీరో ఒక అమ్మాయిని ప్రేమించడం. ఆ అమ్మాయి కొందరి వల్ల మోసపోయి ప్రాణాలు కోల్పోవడం. ప్రేమించిన అమ్మాయి కనిపించకపోవడంతో హీరో మరో స్త్రీని పెళ్లాడటం. దాంతో కోరిక తీరకుండా ప్రాణాలు పోగొట్టుకున్న ఆ అమ్మాయి భూతంగా మారడం. తన చావుకు కారణమైన వారిపై పగ తీర్చుకోవడం.. ప్రేమించిన ప్రియుడి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం.. దాదాపుగా ఇదే కథాంశంతో ఓ 20 సినిమాలు వచ్చి ఉంటాయి. వీటన్నిటికీ ‘గాయత్రి’ సినిమానే ప్రేరణ. ఈ చిత్రం తర్వాత ఆ స్థాయి విజయాన్ని సాధించిన హారర్ సినిమా అంటే ‘కాళరాత్రి’నే చెప్పుకోవాలి. మలయాళంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో కూడా చాలా పెద్ద హిట్. 80ల్లో హారర్ సినిమాలకు తెలుగునాట కూడా మంచి గిరాకీ ఉండేది. ఇంటి నెం.13, క్షణక్షణం భయం భయం, పున్నమిరాత్రి.. ఇలా చాలా హారర్ సినిమాలు ఆ ఎరాలోనే వచ్చి బాగా ఆడాయి.
ఇక హారర్‌ని కొత్తకోణంలో ఆవిష్కరించిన సినిమా రజనీకాంత్ ‘చంద్రముఖి’. మలయాళంలో మోహన్‌లాల్ కథానాయకుడిగా రూపొందిన ‘మణిచిత్రతాజు’ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ‘చంద్రముఖి’ హారర్ కామెడీ అనే కొత్త జానర్‌ని తెలుగుతెరకు పరిచయం చేసింది. సాధారణంగా హారర్ సినిమాల్లో కనిపించని హీరోయిజం, కామెడీ, కళాత్మక కోణం ‘చంద్రముఖి’లో కనిపించడంతో ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనయ్యారు. దాంతో మాతృకకు మించిన విజయాన్ని ‘చంద్రముఖి’కి అందించారు.
‘చంద్రముఖి’లో కామెడీని లైట్‌గా టచ్ చేస్తే.. పూర్తి హారర్ కామెడీ కథాంశంతో సినిమా తీసి తొలి విజయాన్ని అందుకున్నాడు డ్యాన్స్ మాస్టర్ లారెన్స్. ఆ సినిమానే ‘ముని’. 2007లో వచ్చిన ఈ చిత్రంలో తాను పోషించిన ‘రాఘవ’ పాత్రను కొనసాగిస్తూ.. ‘కాంచన’, ‘కాంచన 2’, ‘కాంచన 3’ సినిమాలను తెరకెక్కించాడు లారెన్స్. ఈ ఫ్రాంచైజీలో ప్రతి సినిమా సూపర్ హిట్ కావడం విశేషం. డ్యాన్స్ మాస్టర్ లారెన్స్‌ని, అటు దర్శకునిగా, ఇటు హీరోగా కూడా నిలబెట్టింది ‘కాంచన’. ఇక 2013లో వచ్చిన అచ్చ తెలుగు హారర్ కామెడీ ‘ప్రేమకథా చిత్రమ్’. దర్శకుడు మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జె.ప్రభాకర్‌రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాల ప్రేరణగా రాజుగారి గది, భాగమతి, గీతాంజలి, జాంబిరెడ్డి, ఆనందోబ్రహ్మ, నినువీడని నీడను నేనే చిత్రాలు విడుదలై విజయాలను అందుకున్నాయి. ఇదే ప్యాట్రన్‌లో వచ్చి చేతులు కాల్చుకున్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి. నిజంగా కొన్నాళ్లపాటు టాలీవుడ్లో హారర్ కామెడీ రాజ్యమేలిందనే చెప్పాలి. వీటి మధ్యలో సీరియస్‌గా ఓ హారర్ సినిమాను తీసి నిజంగా ఆడియన్స్‌ని భయపెట్టాడు దర్శకుడు సాయికిరణ్. ఆ సినిమా పేరు ‘మసూద’(2022). చాలా తక్కువ బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ.15 కోట్ల వసూళ్లను రాబట్టి, బయ్యర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.
ఈ సందర్భంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా గురించి. రజనీకాంత్, అనంతనాగ్, మోహన్‌లాల్ వంటి సూపర్స్టార్లు హారర్ సినిమాల్లో నటించి విజయాలను సాధించారు. అయితే హారర్ కామెడీ సినిమాలో మాత్రం ఏ సూపర్‌స్టార్ నటించలేదు. తొలిసారి ప్రభాస్ నటిస్తున్నాడు. ఇందులో ఆయన దెయ్యంగా భయపెడతాడా? దెయ్యాన్ని చూసి భయపడతాడా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. పాన్ ఇండియా స్థాయిలో, దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాదే సినిమా విడుదల కానుంది.
చివరిగా చెప్పొచ్చేదేంటంటే.. మేకర్స్‌కు భయపెట్టడమే పెద్ద టాస్క్. భయపెడుతూ నవ్వించడం ఇంకా పెద్ద టాస్క్. ఈ విషయంలో ఏ మాత్రం తడబడ్డా ఫలితం భయపెట్టడం ఖాయం. నవ్వించడం దేవుడెగురు.. నవ్వుల పాలవ్వాల్సి వస్తుంది.
– బుర్రా నరసింహా