విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకుడు. మధుర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. వచ్చే నెల 14న విడుదలకానుంది. సోమవారం ఈ సినిమా నుంచి ‘తెలుసా నీ కోసమే..’ అనే పాటను అగ్ర నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేశారు. కొన్నేళ్లుగా సంతానలేమితో బాధపడుతున్న వారు ఎక్కువవుతున్నారని, అందుకే దేశంలో పెద్ద ఎత్తుల ఫర్టిలిటీ సెంటర్స్ వెలుస్తున్నాయని, ఈ పాయింట్‌ను తీసుకొని వినోదాత్మకంగా సినిమా తీశామని నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి తెలిపారు.
సమాజంలో కొందరు దంపతులు ఎదుర్కొంటున్న సమస్య నేపథ్యంలో చక్కటి కామెడీ కలబోతగా ఈ చిత్రాన్ని తీశామని, కథానుగుణంగా సంగీతానికి ప్రాధాన్యత ఉంటుందని దర్శకుడు సంజీవ్ రెడ్డి తెలిపారు. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా కుటుంబ విలువలతో ఈ సినిమాను తెరకెక్కించామని హీరో విక్రాంత్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మహిరెడ్డి పండుగుల, సంగీతం: అజయ్ అరసాడ, దర్శకత్వం: సంజీవ్ రెడ్డి.