జాక్ రెడ్డి.. ఇతనికి కాస్త కుల ఫీలింగ్ ఎక్కువ. ‘యోగి వేమన కూడా మా కులంవాడే.. ఆయన అసలు పేరు వేమారెడ్డి.’ అని గర్వంగా చెప్పుకుతిరిగేంత కులాభిమానం ఇతని సొంతం. చూడ్డానికి సీరియస్‌గా ఉంటాడు. కానీ తెరపై మాత్రం నవ్వుల్ని పూయిస్తాడు. సింపుల్‌గా ఇది జాక్ రెడ్డి క్యారెక్టర్. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాలో తరుణ్‌భాస్కర్ నటిస్తున్న పాత్ర పేరు.. తీరుతెన్నులు ఇవి.
శనివారం ఈ సినిమాలో తరుణ్‌భాస్కర్ నటించిన జాక్ రెడ్డి క్యారెక్టర్ ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంజీవ్‌రెడ్డి దర్శకుడు. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మాతలు.
ప్రస్తుతం సమాజంలో యంగ్ కపుల్స్ ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సమస్యను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా రూపొందించామని, ఇందులో తరుణ్‌భాస్కర్ పోషించిన జాక్ రెడ్డి పాత్ర ప్రేక్షకుల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుందని దర్శకుడు చెప్పారు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, అభినవ్ గోమటం, మురళీధర్‌గౌడ్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్.