అమరావతి : ప్రముఖ నటుడు మోహన్‌బాబు రెండో తనయుడు మంచు మనోజ్ (Manchu Manoj ) ఇవాళ తిరుపతిలోని మోహన్‌బాబు(Mohanbabu) వర్సిటీకీ భార్య మౌనికతో కలిసి చేరుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
హైదరాబాద్ నుంచి సతీసమేతంగా రేణిగుంట ( Renigunta ) ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మనోజ్ దంపతులకు ఆయన అభిమానులు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. అనంతరం అభిమానులతో కలిసి ఊరేగింపుగా మోహన్‌బాబు వర్సిటీకి బయలుదేరారు. వర్సిటీకీ మంచు మనోజ్ వస్తున్నారన్న సమాచారంతో ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు (Police) అప్రమత్తమయ్యారు.
వర్సిటీకి చేరుకున్న మనోజ్‌కు పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నందున లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పడంతో మనోజ్ వెనుదిరిగి నేరుగా నారావారిపల్లెకు చేరుకున్నారు. అక్కడ భార్య మౌనికతో కలిసి మంత్రి లోకేష్‌తో సమావేశమయ్యారు. మంత్రితో ఏం చర్చించారన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.