మాదక ద్రవ్యాల కోరల్లో చిక్కుకొని, పెడదోవ పడుతున్న యువతను సరైన మార్గంలోకి తెచ్చేందుకు హీరో కృష్ణసాయి చేస్తున్న చిరు ప్రయత్నమే ‘డేంజర్’. పి.ఎస్.నారాయణ దర్శకుడు. కృష్ణసాయి, పూజిత, మేక రామకృష్ణ, రమేష్ గుత్తుల, నితిష్, వెంకటేశ్వరరావు ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా సంకల్పానికి అద్దం పడుతూ రూపొందించిన ‘ఓ యువతా నీ గమ్యం ఎటువైపు?’ అంటూ సాగే గీతాన్ని మేకర్స్ ఇటీవల విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో కృష్ణసాయి మాట్లాడుతూ ‘సినిమా మాధ్యమం వల్ల ప్రజలు ప్రభావితం అవుతారు. ప్రతి సినిమాకూ ముందు ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అని హెచ్చరికలు చేయడం వల్ల పుగాకు వినియోగం చాలావరకూ తగ్గింది. అందుకే డ్రగ్స్‌పై అవగాహన పెంచేందుకు ఈ గీతాన్ని రూపొందించాం. అందరికీ నచ్చిన ఈ గీతం, మేం తీయనున్న ‘డేంజర్’ సినిమాలో భాగం కానుంది.’ అని తెలిపారు.