అగ్ర నటుడు ఎన్టీఆర్ క్రేజీ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన ముఖచిత్రంతో కూడిన ప్రముఖ మాగజైన్ ‘ఎస్కైర్ ఇండియా’ తాజా ఎడిషన్ మార్కెట్లోకి విడుదలైంది. ఎన్టీఆర్ ఫొటోతో కూడిన ఈ మాగజైన్ కవర్‌పేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నది. ఈ మాగజైన్కి సంబంధించిన ఫొటో షూట్ దుబాయ్‌లో జరిగిందని సమాచారం.
ఈ క్రమంలో ‘ఎస్కైర్ ఇండియా’కు తారక్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘నా జీవితం విషయంలో ఏదీ నేను ప్లాన్ చేసుకోలేదు. ‘కుంగ్ ఫూ పాండా’లో ఒక కొటేషన్ నాకెంతో ఇష్టం. ‘నిన్నటి రోజు చరిత్ర.. రేపటి రోజు తెలియని మర్మం.. కానీ ఈ రోజు మన చేతిలో ఉన్న గొప్ప బహుమతి’. నా మనసులో నాటుకు పోయిన కొటేషన్ ఇది. అందుకే నా దృష్టి ఎప్పుడూ వర్తమానంపైనే ఉంటుంది.
ఒక నటుడిగా నేను ఏది చేయడానికైనా సిద్ధమే. ఇక నా సినీ వారసత్వం గురించి ఇప్పటికిప్పుడు నాకు తెలీదు. అది వారి వ్యక్తిగతం. ఆ విషయంలో నేను ప్లాన్ చేసేదేంలేదు. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే కథలు చెప్పడమే నా లక్ష్యం. భావోద్వేగాలతో కూడిన నిజాయితీ పరుడిగా నన్ను అందరూ గుర్తుపెట్టుకోవాలి. నా కోరిక అదొక్కటే.’ అన్నారు ఎన్టీఆర్. బాలీవుడ్లో ఆయన నటించిన తొలి సినిమా ‘వార్ 2’ ఈ నెల 14న విడుదల కానున్న విషయం తెలిసిందే.