Taapsee Pannu | తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘గాంధారి’ విడుదలకి ముందే కాపీ వివాదంలో చిక్కుకుంది. కళ్యాణ్ బండి అనే రచయిత ఈ నెట్‌ఫ్లిక్స్ సినిమా కథ తన కథను పోలి ఉందని ఆరోపిస్తూ లీగల్ నోటీసులు పంపడం కలకలం రేపింది. కళ్యాణ్ బండి మీడియాతో మాట్లాడుతూ.. తాను 2019లోనే ఈ కథను రాశానని, నాటి నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్‌కు లింక్డిన్ ద్వారా సంప్రదించి మెయిల్ ద్వారా కథను పంపినట్లు తెలిపారు. మే నెలలో ఆ కథ తమకు సెట్ అవ్వదని చెప్పడంతో తాను వేరే వాళ్లకు పిచ్ చేసుకున్నానని అన్నారు. 2023 చివరి నాటికి ఒక స్టూడియో తన కథతో థియేట్రికల్ ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు వచ్చిందని, అయితే 2024 సెప్టెంబర్‌లో కనిక ధిల్లాన్ రైటర్‌గా నెట్‌ఫ్లిక్స్ ‘గాంధారి’ టైటిల్ అనౌన్స్ చేయడంతో షాక్ గురయ్యానని చెప్పారు.
తాప్సీ సినిమాలో కూడా ఒక తల్లి, యువతుల అదృశ్యం అనే పాయింట్ తన కథలాగే ఉండటంతో మోనికాకు మళ్లీ మెసేజ్ చేసినా స్పందన రాలేదని, ఎస్‌డబ్ల్యూఏ (SWA) సూచన మేరకు లీగల్ నోటీసులు పంపినట్లు కళ్యాణ్ వెల్లడించారు. డిసెంబర్ 2024 నాటికి తన నిర్మాతలు కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని తెలిపారు.
అయితే ఈ కాపీ రైట్ ఆరోపణలను కనిక ధిల్లాన్ నిర్మాణ సంస్థ ‘కథా పిక్చర్స్’ పూర్తిగా ఖండించింది. ‘గాంధారి’ అనేది పూర్తిగా స్వతంత్రంగా అభివృద్ధి చేసిన ఒరిజినల్ కథ అని, దీని కథ, స్క్రీన్‌ప్లే పూర్తిగా కనిక ధిల్లాన్ సొంతమని స్పష్టం చేసింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, వీటిని నిరూపితమైన నిజాలుగా ప్రచారం చేయవద్దని మీడియాను, ప్రేక్షకులను మేకర్స్ కోరారు. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.