తెలుగులో అరంగేట్రం చేసిన తొలినాళ్లలో యువతరంలో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది పంజాబీ భామ తాప్సీ. అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఓ వెలుగువెలిగిన ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాంను మార్చింది. దక్షిణాది చిత్రాలకు భిన్నంగా హిందీలో ప్రయోగాత్మక, సామాజిక సందేశాత్మక కథాంశాలకు పెద్దపీట వేస్తూ అనతికాలంలోనే తన ప్రతిభను చాటుకుంది. హిందీ చిత్రసీమలో తనకు వరుసగా అవకాశాలు రావడానికి కారణాలేమిటో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది తాప్సీ.
‘ప్రీతీ జింటాతో నాకు చాలా దగ్గరి పోలికలు కనిపిస్తాయి. ముఖకవళికలు కూడా అలాగే ఉంటాయి. ఆమెకు నేను న్యూ వెర్షన్ అని చెప్పొచ్చు. అందుకే నాకు బాలీవుడ్లో మంచి అవకాశాలు దక్కాయి. ప్రీతీ జింటా ఎప్పుడూ పాజిటివ్ ధృక్పథంతో కనిపిస్తారు. స్క్రీన్‌మీద ఆమె చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. వ్యక్తిగతంగా కూడా నేను ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటాను. ప్రీతి జింటా మాదిరిగానే మంచి సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో మూడు చిత్రాలతో బిజీగా ఉంది.