సోషల్‌మీడియాలో వ్యాప్తి అయిన బాయ్‌కాట్ ట్రెండ్ వల్ల ఇటీవలకాలంలో పలు బాలీవుడ్ చిత్రాలు నష్టాల్ని చవిచూశాయి. ఆమిర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చద్దా’, అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’కు ఈ ఆన్లైన్ బహిష్కరణ సెగ గట్టిగా తాకింది. తాజాగా ఈ వ్యవహారం గురించి కథానాయిక స్వర భాస్కర్ తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసింది. తమ రహస్య అజెండాను అమలు చేయడంలో భాగంగానే కొందరు బాయ్‌కాట్ ట్రెండ్‌ను వ్యాప్తి చేస్తున్నారని చెప్పింది. సోషల్‌మీడియాలో ఈ దుష్ప్రచారానికి గాను సదరు వ్యక్తులు డబ్బులు కూడా తీసుకుంటున్నారని ఆరోపించింది.
ఆమె మాట్లాడుతూ ‘ఖచ్చితంగా దీని వెనక కొన్ని బలమైన శక్తులున్నాయి. తమ భావజాలానికి వ్యతిరేకమైన వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ సోషల్‌మీడియాలో ఉద్దేశ్యపూర్వకంగా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. దేశం మొత్తం తమ పార్టీ జెండానే ఎగరాలనుకునే కొన్ని అవకాశవాద రాజకీయ శక్తులు ఈ కుట్ర వెనక ఉన్నాయి’ అని సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఇలాంటి విషప్రచారం ఎక్కువ కాలం పనిచేయదని, ప్రజలు తొందరలోనే నిజానిజాలేమిటో అర్థం చేసుకుంటారని పేర్కొంది. ప్రస్తుతం ఆమె మాటలు బాలీవుడ్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. స్వరభాస్కర్ కథానాయికగా నటించిన ‘జహాన్ చర్ యార్’ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.