Suriya | తమిళ నటుడు సూర్యకి తమిళంలోనే కాక తెలుగులోను ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలతోనే కాకుండా సేవా కార్యక్రమాలతో అందరి మనసులు గెలుగుచుకున్నాడు. సూర్య స్థాపించిన ‘అగరం ఫౌండేషన్’కు 15 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా చెన్నైలో ఇటీవల ఘనంగా వేడుక నిర్వహించారు. ఈ వేడుకకి ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ప్రముఖులు వెట్రి మారన్, ‘జై భీమ్’ దర్శకుడు టీజే జ్ఞానవేల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ వేడుకలో సూర్య-జ్యోతిక దంపతులు , వారి పిల్లలు దియా, దేవ్ , అలాగే సూర్య సోదరుడు కార్తీ కుటుంబంతో పాల్గొన్నారు. అగరం ఫౌండేషన్ 15 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, ఇప్పటి వరకు అందించిన సేవలను అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సూర్య కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సూర్య, జ్యోతిక, వారి పిల్లలు దియా, దేవ్‌లతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ పండితులు వారికి ఆశీర్వచనాలు అందించారు. ఆలయం వెలుపల సూర్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, భక్తులు గుమిగూడారు.
ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఉత్సాహం చూపించారు. ఆ సందర్భంలో తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో సూర్య కూతురు దియా సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. నెటిజన్లు ఆమె లుక్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తల్లిన మించిన అందం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు జ్యోతిక గ్లామర్ కూడా ఏ మాత్రం తగ్గలేదని అంటున్నారు. ప్రస్తుతం వారి పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కాగా, సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ అనే సాంఘిక సేవా సంస్థ 15 సంవత్సరాల క్రితం ప్రారంభం కాగా, ఈ సంస్థ ప్రధానంగా తమిళనాడులోని నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ ఫౌండేషన్ చేపట్టిన ‘విధ్యా ప్రాజెక్ట్’ ద్వారా ఇప్పటి వరకు 6700 మందికి పైగా గ్రాడ్యుయేట్లను సమాజానికి అందించారు. అనేక మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన అగరం ఫౌండేషన్ సేవలు అభినందనీయమైనవి.