ప్రతిష్టాత్మక సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ మంగళవారంతో 60ఏళ్ల అద్భుత ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. సరిగ్గా అరవైఏళ్ల క్రితం, అంటే.. 1964 మే 21న సురేశ్ ప్రొడక్షన్స్ తొలి చిత్రం ‘రాముడు-భీముడు’ విడుదలైంది. మహానటుడు నందమూరి తారకరామారావు తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాక, ఎన్నోభాషల్లో ఈ కథ పునర్నిర్మించబడింది. ఆ విధంగా తొలి సినిమాతోనే నిర్మాతగా సంచలనాన్ని నమోదు చేశారు డి.రామానాయుడు.
సురేశ్ ప్రొడక్షన్స్ 60 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో శతాధిక చిత్రాలను నిర్మించడంతోపాటు, అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించి అరుదైన ఘనతను సాధించడం విశేషం. ఆ సంస్థ నుంచి వచ్చిన ఎన్నో చిత్రాలు క్లాసికల్ హిట్స్‌గా, మోడరన్ మాస్టర్ పీస్‌లు మిగిలిపోయాయ్.
60ఏళ్ల ఈ ప్రయాణంలో తమతో భాగమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రేక్షకులకు, అభిమానులకు, ప్రతి ఒక్కరికీ ప్రస్తుత సురేశ్‌ప్రొడక్షన్స్ అధినేతలైన సురేశ్‌బాబు, వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. డా.డి.రామానాయుడుగారి వారసత్వాన్ని, ఆయన కుటుంబసభ్యులుగా తాము దిగ్విజయంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.