Thug Life Movie | అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ కొన్ని సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టు మాట్లాడుతూ.. ఆగ్రహాం వ్యక్తం చేసింది. సినిమా విడుదలని ఆపుదామని గుంపులు, అరాచక శక్తులు వీధుల్లోకి వచ్చి గొడవలు సృష్టిస్తే వాటిని అనుమతించబోమని తెలిపింది. సెన్సార్ బోర్డు అనుమతి పొందిన ఏ సినిమానైనా విడుదల చేయాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వం రేపటిలోగా స్పందించాలని ఆదేశించింది.
‘థగ్ లైఫ్’ సినిమా విడుదలను కర్ణాటకలో అడ్డుకుంటున్నారని, థియేటర్లకు బెదిరింపులు వస్తున్నాయని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. గతంలో కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ సినిమాను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై చిత్ర యూనిట్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా, కమల్ క్షమాపణ చెబితే సమస్య పరిష్కారమవుతుందని కోర్టు సూచించింది. అయితే కమల్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో, ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.
ఈరోజు విచారణ సందర్భంగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం “ప్రతి సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి లభించిన తర్వాత, దానిని విడుదల చేయాలి. ఒత్తిళ్లకు తలొగ్గడం, వీధుల్లో గొడవలు సృష్టించడానికి అనుమతించడం చట్టబద్ధమైన పాలనకు విరుద్ధం అని తీవ్రంగా మందలించింది. కర్ణాటకలో ఈ విషయమై పెండింగ్లో ఉన్న కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేసుకోవాలని కూడా ఆదేశించింది. కర్ణాటకలో సినిమా విడుదలకు ఎదురైన ఈ అడ్డంకులు, చిత్ర కలెక్షన్లపై ప్రభావం చూపాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ‘థగ్ లైఫ్’ కర్ణాటకలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. తదుపరి విచారణ రేపు జరగనుంది.
Read More