తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కొత్త పాలక మండలిని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా రవీంద్ర గోపాల, ఉదయ్‌కుమార్ రెడ్డి, కార్యదర్శిగా శ్రీధర్ విఎల్, సంయుక్త కార్యదర్శిగా చంద్రశేఖర్ రావు, కోశాధికారిగా సత్యనారాయణ గౌడ్ ఎన్నికయ్యారు. వీరితో పాటు 15 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్‌ను ఎంపిక చేశారు.
ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని, బాధ్యతాయుతంగా పనిచేసి పరిశ్రమ అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని సునీల్ నారంగ్ చెప్పారు. తెలుగు సినీరంగంలో ఓల్డెస్ట్ ఛాంబర్ ఇదేనని, ఇప్పుడు 80వ జనరల్ బాడీ మీటింగ్ జరిపామని కార్యదర్శి శ్రీధర్ విఎల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెమినీ కిరణ్, సురేష్‌బాబు, కె.ఎల్.దామోదరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కార్యదర్శిగా ఎన్నికైనా శ్రీధర్ వి.ఎల్. మాట్లాడుతూ ‘2016 నుంచి పర్సంటేజీ సిస్టమ్ గురించి చాలా మీటింగ్స్ జరిగాయి. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్స్ బంద్ అయిపోతున్నాయి. వాటిని రక్షించుకోవాలి. ఇక థియేటర్ల బంద్ గురించి మేమెప్పుడూ మాట్లాడలేదు. పర్సంటేజీ సిస్టమ్ అమలు చేయాలని ఫిల్మ్ ఛాంబర్‌ను కోరాం. మేము థియేటర్స్ బంద్ చేస్తున్నామని ఎవరికీ లెటర్లు కూడా ఇవ్వలేదు. ఇద్దరు దర్శకులు, ఇద్దరు నిర్మాతలు ఈ విషయంలో ఇష్యూ చేశారు. వారి పేర్లు భవిష్యత్తులో వెల్లడిస్తా. వాస్తవానికి పవన్‌కల్యాణ్ సినిమా వస్తున్నదని తెలిసి థియేటర్లని ఖాళీగా పెట్టుకున్నాం. ఈ నెల మొత్తం పోయింది.
జనవరి నుంచి ఇప్పటివరకు సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్వేర్, కోర్ట్ ఈ మూడు చిత్రాలే హిట్ అయ్యాయి. ఈ మూడు సినిమాల మీదనే రెంట్ వర్కవుట్ అయింది. పరిస్థితి ఇలా ఉంటే.. అనవసరంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లను బ్లేమ్ చేస్తున్నారు. ఈ రోజు హీరోలు రెండేళ్లకో సినిమా చేస్తున్నారు. రెమ్యునరేషన్స్ అమాంతం పెంచుతున్నారు. మొన్న ఓ డిజాస్టర్ సినిమా హీరోకు 13కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఆ సినిమాకు వరల్డ్‌వైడ్ 2,3 కోట్ల షేర్ కూడా రాలేదు. ఇక నుంచైనా పెద్ద హీరోలు సంవత్సరానికి రెండు సినిమాలు చేయాలని కోరుతున్నా’ అన్నారు.