‘గోదారి గట్టుపైన’ గోదావరి నేపథ్యంలో సాగే క్యూట్ కథ. ఇందులో ఆద్యంతం ఎమోషన్సే. హీరోహీరోయిన్ల ప్రేమ, తండ్రీకూతుళ్ల భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఫన్ కూడా ఓ రేంజ్లో ఉంటుంది. నేను పక్కా తెలంగాణ యువకుడిని. కేవలం ఈ పాత్ర కోసం దాదాపు నాలుగు నెలలు కష్టపడి గోదారి యాస నేర్చుకున్నాను. ఇందులో బుద్ధిమంతుడైన ఆటోడ్రైవర్‌గా కనిపిస్తా.
ఈ సినిమాలో ఆటో రేస్ కూడాఉండటంతో ఆటో డ్రైవింగ్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా’ అని సుమంత్ ప్రభాస్ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’. నిధి ప్రదీప్ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్రధారి. సుభాష్ చంద్ర దర్శకుడు. రెడ్ పప్పెట్ పతాకంపై అభినవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలకానున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో సుమంత్ ప్రభాస్ మాట్లాడారు. ‘మంచి కథ కోసం వెతుకుతున్న తరుణంలో దర్శకుడు సుభాష్‌చంద్ర కలిశారు. ఆయన వినిపించిన కథ నచ్చడం, నాక్కూడా ఛాలెంజ్‌గా అనిపించడంతో ఒప్పుకున్నాను. ఇందులో కుటుంబానికీ, స్నేహితులకు విలువిచ్చే పాత్ర నాది. జగపతిబాబు, నిధి ప్రదీప్ తండ్రీకూతుళ్లుగా కనిపిస్తారు.
వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలం. జగపతిబాబు భార్యగా సీనియర్ నటి లైలా నటించారు. నాగవంశీ సంగీతం కూడా బాగుంటుంది’ అని సుమంత్ ప్రభాస్ తెలిపారు. తన నుంచి రానున్న నెక్ట్స్ సినిమా షూటింగ్ పూర్తయిందని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తానని, ఇక విరామం లేకుండా సినిమాలు చేస్తానని సుమంత్ ప్రభాస్ చెప్పారు.