Pushpa-2 | అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 మూవీ బాక్సాఫీస్ వద్ద మెగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రెండురోజుల్లోనే దాదాపు రూ.450కోట్ల వరకు రాబట్టింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప-2 విజయం దర్శకుడు సుకుమార్దేనన్నారు. ప్రాంతీయ సినిమా పరిశ్రమ ఎదిగి దేశంలో ఉన్నత స్థాయిలో ఉందని.. పుష్ప-2ని ప్రోత్సహించిన తెలుగు ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపాడు బన్నీ. సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ధరల పెంపునకు అనుతిచ్చి రికార్డుల సాధనకు సహకరించారన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై స్పందించారు. తాను మూడేళ్ల తర్వాత సంధ్య థియేటర్లో మూవీ చూసేందుకు వెళ్లాలని.. అక్కడ బయట అభిమానులు ఎక్కువగా ఉండడంతో సినిమా చూడకుండానే వెళ్లిపోయానని చెప్పారు.
రేవతి అనే మహిళ చనిపోయారని తెలిశాక స్పందించేందుకు తనకు సమయం పట్టిందని.. అయితే, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. థియేటర్ వద్ద జరిఘిన ఘటనపై దర్శకుడు సుకుమార్ స్పందించారు. తాను మూడురోజులుగా సంతోషంగా లేనని చెప్పాడు. మూడు సంవత్సరాలు కష్టపడి సినిమా తీశానని.. ఆరేళ్లు కష్టపడ్డా ఓ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేనన్నారు. రేవతి మరణంతో తన మనసు కకావికలమైపోయిందని.. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. నిర్మాత నవీన్ మాట్లాడుతూ మూవీ వేగంగా రూ.500కోట్ల కలెక్షన్ రాబట్టిందని.. ఈ మూవీ నిర్మించినందుకు గర్వంగా ఉందన్నారు. మరో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ పుష్ప-2 టికెట్ ధరలపై మేం చర్చిస్తున్నామన్నారు. పుష్ప-2 టికెట్ ధరలు అందుబాటులో ఉంటాయని.. టికెట్ ధర రూ.800 అనేది ప్రీమియర్ షో వరకే నని స్పష్టం చేశారు.