సినిమా షూటింగ్స్‌లో ప్రమాదాలు జరగడం సహజం . కాని కొద్ది సార్లు షూటింగ్లో జరిగే ప్రమాదాల వలన ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తుంది. ఆ మధ్య శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 షూటింగ్ ప్రమాదంలో భారీ క్రేన్ విరిగిపడడం వలన ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. మరో 10 మందికి తీవ్రగాయాలయిన విషయం తెలిసిందే.ఆ ప్రమాదం నుండి కమల్, శంకర్, కాజల్ తృటిలో తప్పించుకున్నారు.
షూటింగ్స్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎవరో ఒకరు ప్రమాదాల బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ‘లవ్ యూ రచ్చు’ చిత్రం షూటింగ్లో కరెంట్ షాక్‌తో సహాయ ఫైటర్ మృతి చెందాడు. తమిళనాడుకు చెందిన వివేక్ (28) రామనగర తాలూకా జోగనదొడ్డి వద్ద షూటింగ్ చేస్తుండగా కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు సహాయకులు గాయపడ్డారు.
గాయపడ్డ వారిని బెంగళూరులోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంపై దర్శకుడు శంకర్‌రాజ్, నిర్మాత గురుదేశ్పాండె, ఫైట్ మాస్టర్ వినోద్‌లను బిడిది పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ.. షూటింగ్‌లకు సంబంధించిన కొన్ని నిబంధనలను ప్రభుత్వం త్వరలో జారీ చేస్తుందని చెప్పారు.