SS rajamouli | సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళిల కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం SSMB29 షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే కెన్యా అడవుల్లో యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసుకున్న చిత్రబృందం, ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా భారీ సెట్‌ను నిర్మించినట్లు సమాచారం. సుమారు రూ. 50 కోట్లతో నిర్మించిన ఈ సెట్ కాశీ నగరాన్ని పోలి ఉందని, ఇందులో నదీ తీరాలు, ఘాట్లు, పురాతన దేవాలయాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ సెట్లో మహేశ్ బాబుతో పాటు ఇతర ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ అక్టోబర్ 10 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ‘గ్లోబ్ ట్రాటర్’ అనే టైటిల్‌ను జోడించినట్లు తెలుస్తోంది. మహేశ్ బాబు ఈ సినిమాలో ప్రపంచాన్ని చుట్టేసే సాహసికుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా 2026 చివరిలో విడుదలయ్యే అవకాశం ఉండగా.. ఈ ఏడాది నవంబర్‌లో సినిమా టీజర్ విడుదల కానుంది.