పిల్లలకు పరీక్షలైపోగానే ఎండాకాలం సెలవులిచ్చేస్తుంది గవర్నమెంట్. అలాగే రాజమౌళి కూడా తన టీమ్‌కి సమ్మర్ హాలీడేస్ ప్రకటించేశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ‘SSMB 29’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు ప్రియాంక, మహేశ్‌లపై ఓ పాటను కూడా రాజమౌళి చిత్రీకరించారు. ఏప్రిల్ 30తో పూర్తయిన ఈ పాట చిత్రీకరణతో ఈ షెడ్యూల్ కంప్లీటయ్యింది. జూన్ 10ని నెక్ట్స్ షెడ్యూల్ డేట్‌గా ఫిక్స్ చేశారు రాజమౌళి.
ఈ 40 రోజులు మహేష్ ఫ్యామిలీ ప్రతి ఏడాది లాగే హాయిగా ఫారిన్ ట్రిప్‌కి వెళ్లిపోవచ్చు. అలాగే రాజమౌళి కూడా విహార యాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. ఇదిలావుంటే.. 40 రోజుల తర్వాత మొదలయ్యే షెడ్యూల్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ వారణాసి సెట్‌ను సిద్ధం చేసే పని మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ సెట్‌కి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి.
జూన్ 10 నుంచి ఈ సెట్లోనే కథలో కీలకమైన వారణాసి నేపథ్య సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరిస్తారట. 2026లో ఈ సినిమా విడుదలవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే.. ఇన్సైడ్ టాక్ ప్రకారం 2027 దాకా ఆగాల్సిందేనని తెలుస్తున్నది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నానా పటేకర్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నారట. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.