‘వారణాసి’ చిత్రాన్ని అనుకున్న టైమ్‌లో పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారు దర్శకుడు రాజమౌళి. కొంతటాకీ పార్ట్ మినహా దాదాపు షూటింగ్ పూర్తికావొస్తున్నదని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 7 నుంచి మొదలుకానుంది. ఇందులో అత్యంత కీలకమైన యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారట.
చిత్ర కథానాయకుడు మహేశ్‌బాబుతో పాటు ప్రధాన తారాగణం ఈ షూట్లో పాల్గొంటారని, దాదాపు 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనే ఈ పోరాట ఘట్టాలు సినిమాలోనే హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. వానరసేన నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ సీక్వెన్స్ రోమాంచితంగా ఉంటుందని, దాదాపు రెండుమూడు వారాల పాటు ఏకధాటిగా ఈ సినిమా షెడ్యూల్‌ను చేయబోతున్నారని సమాచారం. ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు 1500కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.