Sruthi Hassan | సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. విజయాల పరంగా కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ, ఆఫర్ల పరంగా మాత్రం ఎప్పుడూ కొదవలేదు. ఇటీవల వరుసగా ‘వాల్తేరు వీరయ్య’, ‘సలార్’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద హిట్లు కొట్టిన శృతి, రీసెంట్గా ‘కూలీ’ ద్వారా ప్రేక్షకులను అలరించింది. ఇటీవల ఆమె సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీల మధ్య ఉన్న తేడా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న నటులు చాలా వినయంగా ఉంటారు. ఇక్కడ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది.
సినిమా ప్రారంభోత్సవం రోజున దేవుడి పటాల ముందు కొబ్బరికాయలు కొట్టడం, పూజలు చేయడం, మనసులో కోరికలు కోరుకోవడం వంటివి సాధారణం. అయితే నేను తొలిసారిగా ఇవి చూసినప్పుడు ఆశ్చర్యపోయాను, ఎందుకంటే మా ఇంట్లో ఇలాంటి ఆచారాలు ఎప్పుడూ ఉండేవి కావు, పూజలు పెద్దగా చేసేవారు కాదు, కానీ క్రమశిక్షణ మాత్రం ఎప్పుడూ ఉండేది అని ఆమె చెప్పింది. అదే సమయంలో బాలీవుడ్లో ఈ రకమైన ఆచారాలు పెద్దగా కనిపించవని కూడా శ్రుతి పేర్కొంది. “హిందీ సినిమాల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటివి పాటిస్తారు. సౌత్‌లో డబ్బు సంపాదించిన వారు కూడా పాత పద్ధతులను గౌరవిస్తుంటారు. వారిని చూస్తే ఇంకా పాత అంబాసిడర్ కారులోనే ప్రయాణిస్తున్నారా అనిపిస్తుంది. వారు ఆడంబరాల కంటే విలువలకు ప్రాధాన్యం ఇస్తారు” అని చెప్పింది.
తన తండ్రి కమల్ హాసన్ విషయానికొస్తే, ఆయన కూడా దేవుళ్లు, ఆచారాలు నమ్మని వ్యక్తి అని శ్రుతి గుర్తుచేసింది. “కమల్ గారు ఎప్పుడూ తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. పలు సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు వివాదాలకు దారితీసినా, తాను నమ్మిన దారినే ఎంచుకుంటారు. ఆ లక్షణం నాకు కూడా వచ్చింది” అని శృతి హాసన్ స్పష్టం చేసింది.