ఇంజినీరింగ్ చదవాలి, అమెరికాకు వెళ్లాలి, అక్కడే జాబ్ చేయాలి. ఇవే ఈ తరం కోరికలు. ఈ కోరికలన్నీ ఆమెకు వెంట వెంటనే తీరిపోయాయి. కానీ, కష్టమైనా ఇష్టమైన పని చేయాలని మళ్లీ వెనక్కి వచ్చేసింది. ‘సినిమా అంటే ఇష్టం’ అనడం తప్ప ఇంకేమీ తెలియని సినీరంగంలో అవకాశం వెతుక్కోవడానికి అమెరికా వదిలి, రెక్కలు కట్టుకొని స్వదేశంలో వాలింది. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుని తొమ్మిదేండ్లు నిలబడింది. సిల్వర్ స్క్రీన్‌పై సృజన అడుసుమిల్లి గోల్డెన్ లెటర్స్‌తో వెలిగిపోతున్నది. ఆ పేరుని సార్థకం చేసిన ప్రయాణాన్ని జిందగీ పాఠకులతో పంచుకున్నారిలా…
మా ఇంట్లో చదువుకే తొలి ప్రాధాన్యం. బీటెక్ అయిన తర్వాత స్కాలర్షిప్ మీద అమెరికా వెళ్లాను. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ టొలిడోలో ఎం.ఎస్. (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్)లో చేరాను. ఆ యూనివర్సిటీలో టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ చదువుకున్నాను. అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు చదువు చెప్పేదాన్ని. స్టూడెంట్స్‌లో కొంతమంది నలభై ఏళ్లు, యాభై ఏళ్లు దాటినవాళ్లు ఉండేవాళ్లు. వాళ్లంతా ఉద్యోగాలు చేసినవారే. అయినా, అనుకున్న డిగ్రీ సాధించాలనే తపనతో చేస్తున్న పనిని వదిలిపెట్టి మళ్లీ స్టూడెంట్స్‌గా మారారు. వాళ్ల పిల్లలతో కలిసి కాలేజీకి వచ్చేవాళ్లు. అది నాకు కొత్తగా అనిపించింది. మన దగ్గర ఈ వయసులో చదువుకోవాలి. ఈ వయసులో ఉద్యోగం సంపాదించుకోవాలి. ఈ ఏజ్‌లో పెండ్లి చేసుకోవాలి.. ఇలా రూల్స్ ఉంటాయి. వాళ్లను చూశాక ఈ రూల్స్ మనం పెట్టుకున్నవేనని అనిపించింది. వాటిని బ్రేక్ చేయాలని డిసైడ్ అయ్యాను.

రిస్క్ తీసుకోవాలంటే అందరికీ ఉన్నట్టు నాకూ భయం ఉండేది. కానీ, వీళ్లను చూశాక ఆ భయం పోయింది. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. స్కూల్లో ఎవరైనా నీకు ఏది ఇష్టమని అడిగితే.. వెంటనే ‘సినిమా’ అనేసేదాన్ని. చెప్పనైతే చెప్పేదాన్ని కానీ, అసలు సినిమా రంగంలో ఎలాంటి అవకాశాలు ఉంటాయో కనీసం అవగాహన ఉండేది కాదు. అమెరికా వెళ్లిన తర్వాత సినిమాల్లో ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది. అదే మాట అమ్మానాన్నకు చెప్పాను. వాళ్లు మొదట షాక్ అయ్యారు. ‘వీకెండ్స్‌లో సినిమాలు చూడ్డం వరకే అనుకున్నాం. కానీ, నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని అనుకోలేదు’ అన్నారు. అలాగని నానా హంగామా చేయలేదు. అర్థం చేసుకున్నారు. నా ఇష్టానికే వదిలేశారు.

మా నాన్న ‘సినిమాలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావ్? కథలు రాస్తావా? డైలాగ్స్ రాస్తావా? డైరెక్ట్ చేస్తావా? యాక్ట్ చేస్తావా? సినిమాల్లో నువ్వేంటి?’ అనడిగారు. నేను రాయను, కథలు చెప్పను, కెమెరా ఇంట్రస్ట్ లేదు. ఏం చేయాలన్న సందేహం వచ్చింది. సినిమా గురించి తెలుసుకుందామని 24 క్రాఫ్ట్స్ గురించి స్టడీ చేశాను. ఆ సందర్భంలో ‘కటింగ్ ఎడ్జ్.. ద మ్యాజిక్ ఆఫ్ మూవీ ఎడిటింగ్’ డాక్యుమెంటరీ చూశాను. అందులో.. రెండు, మూడు సీన్లలో డ్రామా నుంచి మెలో డ్రామాలోకి సినిమాలో ఎలా మారుతుంది? క్యారెక్టరైజేషన్ ఎలా చేస్తారు? ఎమోషన్ని ఎలా తెస్తారు? సినిమా టెంపో ఎలా మారుస్తారో హాలీవుడ్‌లోని ప్రముఖ ఎడిటర్ల విశ్లేషణ కనిపించింది. థియేటర్లో సినిమా అయిపోవస్తుంటే ఏదో తెలియని దిగులు కలుగుతుంది.
మళ్లీ మన రెగ్యులర్ లైఫ్ గుర్తొస్తుంటుంది. మన బాధల్ని మరిపించే శక్తి సినిమాకు ఉంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని టేబుల్ మీదనే ఇవ్వొచ్చని ఆ డాక్యుమెంటరీ చూసినప్పుడు అర్థమైంది. ఎడిటింగ్ నాకు సరైనదనిపించింది. అలా ఎడిటర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. అదే విషయం ‘ఎడిటర్ అవుతాను. ఎడిటింగ్ నేర్చుకుంటాను’ అని ఇంట్లో, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి చెప్పాను. మావాళ్లు మళ్లీ ఆశ్చర్య పోయారు! యాక్టర్, రైటర్, డైరెక్టర్ అర్థమవుతుంది. కానీ ఎడిటర్ ఏంటి? అందరూ అలా అనేసరికి నేనూ ఆలోచనలో పడ్డాను. డైరెక్షన్ గానీ, మరేదైనా ఎంచుకోవాలా అని కొంతకాలం ఆలోచించాను. కానీ, ఎడిటింగ్ మీద ఏదో ఆసక్తి ఏర్పడింది. అదే నా చాయిస్ అని ఫిక్సయ్యాను. తర్వాత ఎంతమంది చెప్పినా.. నా నిర్ణయం మార్చుకోలేదు.
అప్పటికే నాకు జాబ్ వచ్చింది. అయినా సరే, సినిమాలకు పని చేయడానికి సిద్ధపడ్డాను. ‘నీకు సినిమాలంటే ఇష్టం ఉంటే కొంత టైమ్ పెట్టుకో! ప్రయత్నించు’ అని మావాళ్లన్నారు. సినిమా కోసం అమెరికాను వదిలిపెట్టి ఇండియా వచ్చాను. ఒక ఏడాది కాలపరిమితి పెట్టుకొని ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఏడాదిలో ఏమీ అవ్వదని దిగాక తెలిసింది. పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చదవాలనుకున్నా! కానీ, అప్పటికే అడ్మిషన్లు అయిపోయాయి. అప్పటిదాకా ఖాళీగా ఉండకుండా ముంబయికి వెళ్లాను. ఒక ఇన్స్టిట్యూట్లో చేరి, ఫైనల్ కట్ ప్రో నేర్చుకున్నాను. ఆ తర్వాత ఒక డిజిటల్ యాడ్ కంపెనీ వాళ్ల స్టూడియోలో ఎడిటర్‌గా జాబ్‌లో చేరాను. ఆ ఉద్యోగం చేస్తూ ఎఫ్టీఐఐకి ప్రిపేర్ అయ్యాను. ఎంట్రన్స్ రాశాను. సీటు వచ్చింది.
పూణె వెళ్లి మూడేండ్లపాటు ఫిల్మ్ ఎడిటింగ్ కోర్స్ చదివాను. అలా నా జర్నీ స్టార్ట్ అయింది. ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అసిస్టెంట్‌గా పని చేయాలనుకున్నాను. ఫిల్మ్ స్కూల్లో చదవడం వేరు. సినిమాలో ప్రాక్టికల్ వేరు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారిని సంప్రదించాను. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. ఆకాశవాణి సినిమా, మోడర్న్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్‌లకు అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేశాను. శ్రీకర్ గారు ‘నువ్వు చూడు.. నేర్చుకో’ అంటారు. శ్రీకర్ గారి దగ్గరే ఎక్కువ కాలం పని చేయాలనుకున్నాను. కానీ, కొవిడ్‌తో ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది.

జాబ్ వద్దనుకున్నాను. కావాలనుకున్న సినిమా రంగంలో ఏం సాధించలేకపోయాను. అప్పటికే తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. ‘ఇప్పుడేం చేయాలి? ఎవరిని అప్రోచ్ అవ్వాలి’ అని ఆలోచిస్తున్న రోజుల్లో.. ‘కలర్ ఫొటో’ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా బాగా నచ్చింది. ఆ సినిమా తీసిన టీమ్‌కి నా గురించి మెయిల్ చేశాను. అనురాగ్ నుంచి కాల్ వచ్చింది. మేం సినిమా చేస్తున్నాం. ఒకసారి ఆఫీస్‌కి రమ్మన్నారు. ‘మేం ఫేమస్’ సినిమాకి ఎడిటర్ అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ‘పేక మేడలు’ సినిమాకు ఎడిటర్‌గా పని చేశాను. కుమారి శ్రీమతి, డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్‌లకు ఎడిటర్‌గా పనిచేశాను. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న ‘దండోరా’ సినిమాకుఎడిటింగ్ చేపట్టాను.
ఎడిటర్‌గా చేస్తున్నప్పుడు రకరకాల కంటెంట్ వస్తుంది. ప్రేమ, ముద్దు సన్నివేశాలు ఉంటాయి. ఐటమ్ సాంగ్స్ ఉంటాయి. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అవేమీ ఇబ్బంది పెట్టవు. అవన్నీ దాటితేనే ఇక్కడిదాకా వచ్చాం. ఎడిటర్ డ్యూటీలో ఉంటే నేను ఒక టెక్నీషియన్ని మాత్రమే! సినిమా ఎడిటర్‌గా పనిచేయాలన్న నా లక్ష్యం లాంగ్ జర్నీ. అది ఇప్పుడే మొదలైంది. అన్ని జోనర్ సినిమాలకు పని చేయాలి. పెద్ద సినిమాలు చేయాలి. పెద్ద బ్యానర్. పెద్ద స్కేల్ ప్రాజెక్టులకు పని చేయాలన్నదే నా కోరిక.
మా ఫ్యామిలీలో అమ్మాయి ఇలా ఉండాలి, అలా ఉండకూడదనే ఆంక్షలు లేవు. చదువుకుంటాను, నేర్చుకుంటాను అంటే కాదనరు. వయసు రాగానే పెళ్లి చేసుకోవాలనే మాటలు వినిపించవు. ‘ముందు నీ లైఫ్ ఏంటి? ఎలా ప్లాన్ చేసుకుంటావు’ అంటారు. అమెరికా చదువు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరడం, సినిమాల్లో ప్రయత్నాలకు మా ఫ్యామిలీ నుంచి ఇబ్బంది రాలేదు. బంధువులు, బయటివాళ్లతో కొద్దిగా ఇబ్బంది అనిపించింది. మా అమ్మతో ఒకరు ‘పప్పన్నం ఎప్పుడు పెడుతున్నారు?’ అనడిగారు. ‘నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా ఇంటికి రా. పప్పన్నం వండి పెడతా’ అని మా అమ్మ బదులిచ్చింది. నాకు మా అమ్మానాన్న సపోర్ట్ ఉంది. పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఆడపిల్ల ఏదైనా చేయగలదు, సాధించగలదు.
– సృజనా అడుసుమిల్లి
– నాగవర్ధన్ రాయల
– చిన్న యాదగిరి గౌడ్