వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన వైవిధ్య కథాచిత్రం ‘శ్రీచిదంబరం’. వినయ్ రత్నం దర్శకుడు. చింతా వినీషరెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలు. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో టీజర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ప్రముఖ హీరో సత్యదేవ్, దర్శకులు వశిష్ట, వెంకటేష్ మహా, యదువంశీ, సాయిమార్తాండ్, ‘క’ దర్శకులు సందీప్, సుజిత్ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
సత్యదేవ్ టీజర్‌ని ఆవిష్కరించారు. ‘ఈ కథ నాకు బాగా నచ్చింది. గ్లామర్ కంటే గ్రామర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, కొత్తవాళ్లతో సినిమా చేశాను. అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు.’ అని నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి అన్నారు. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుందని హీరో వంశీ తుమ్మల నమ్మకం వెలిబుచ్చారు.
నిర్మాతల సహకారం వల్లే ఈ సినిమా ఇంతబాగా వచ్చిందని, చేసే పనిలో నిజాయితీ ఉంటే యూనివర్స్ సహకరిస్తుందనడానికి ఈ సినిమానే ఉదాహరణ అని దర్శకుడు చెప్పారు. వింటేజ్ విలేజ్ డ్రామాగా, ఓ అందమైన ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతున్నట్టు టీజర్ చెబుతున్నది.