‘సాధారణంగా ఇద్దరమ్మాయిలు, ఓ అబ్బాయి అంటే ముక్కోణపు ప్రేమకథ అనుకుంటారు. కానీ ఈ సినిమాలో ఓ యూనిక్ పాయింట్ ఉంటుంది. అదేంటో ఇప్పుడే చెప్పకూడదు. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే’ అని చెప్పింది శ్రీనిధి శెట్టి. ఆమె సిద్ధు జొన్నలగడ్డ సరసన ఓ నాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసుకదా’ ఈ నెల 17న విడుదలకానుంది.
నీరజా కోన దర్శకురాలు. ఈ సందర్భంగా గురువారం పాత్రికేయులతో ముచ్చటించింది శ్రీనిధిశెట్టి. యాక్షన్, రక్తపాతం ఉన్న కేజీఎఫ్, హిట్-3 వంటి చిత్రాల తర్వాత ఓ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ చేయడం సరికొత్త అనుభూతి అని చెప్పింది. ఈ సినిమాలో తాను రాగ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, తన క్యారెక్టర్లో కొంచెం గ్రేషేడ్స్ కనిపిస్తాయని తెలిపింది.
‘ఈ సినిమాలోని కొత్త పాయింట్ ప్రతీ ఒక్కరిని సర్ప్రైజ్ చేస్తుంది. లవ్, ఎమోషన్స్, కామెడీ.. ఇలా అన్ని అంశాల కలబోతగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. సిద్ధు జొన్నలగడ్డకు సినిమాకు సంబంధించిన ప్రతి క్రాప్ట్స్‌పై అవగాహన ఉంది. ఆయన టైమింగ్ బాగుంటుంది.
ఇక రాశీఖన్నా క్రమశిక్షణ కలిగిన నటి. తన ఆహారపు అలవాట్లు, వర్కవుట్స్ అన్నీ పద్ధతిగా ఉంటాయి’ అని శ్రీనిధి శెట్టి పేర్కొంది. వెంకటేష్-త్రివిక్రమ్ సినిమా కథానాయికగా ఎంపికయ్యారనే వార్తలపై స్పందిస్తూ ‘నిజంగా ఆ విషయం నాకు తెలియదు. ఆ సినిమా ఛాన్స్ రావాలని కోరుకుంటున్నా. ఆ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ గురించి నిర్మాతలే చెబుతారు’ అని వివరించింది.