సాధారణంగా సినీరంగంలో విజయాలను బట్టే అవకాశాలొస్తుంటాయి. కానీ తెలుగు సొగసరి శ్రీలీల మాత్రం అందుకు మినహాయింపు. సక్సెస్ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీల్లో భారీ సినిమాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ‘పరాశక్తి’ చిత్రం ద్వారా శ్రీలీల తమిళంలో అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. శివకార్తీకేయన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. 1965లో తమిళనాడులో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా పొలిటికల్ హిస్టారిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానుంది.
తాజాగా ఈ చిత్రానికి శ్రీలీల తమిళంలో సొంతంగా డబ్బింగ్ చెబుతున్నది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఎక్స్ ఖాతా ద్వారా పంచుకుంది. సాధారణంగా పరభాషలో తొలి చిత్రానికే నాయికలు డబ్బింగ్ చెప్పడం అరుదైన విషయమేనని చెప్పాలి. అయితే శ్రీలీల మాత్రం ఈ విషయాన్ని సవాలుగా తీసుకుందట. సొంతగొంతు ఉంటేనే తెరపై ఎమోషన్స్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతాయని, ఇకపై ఏ భాషలో నటించినా సొంతంగా డబ్బింగ్ చెబుతానని ధీమా వ్యక్తం చేస్తున్నదీ అచ్చ తెలుగందం. ప్రస్తుతం ఆమె తెలుగులో పవన్‌కల్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రంలో నటిస్తున్నది.