Swag | ‘ఈ సినిమాకు ముందు ‘స్వాగనిక వంశానికి సుస్వాగతం’ అని టైటిల్ పెట్టాలనుకున్నాం. యూత్ పలకడానికి ఇబ్బందిపడతారని ‘స్వాగ్’ అని పేరు పెట్టాం. ఇది ఒక వంశానికి చెందిన కథ. 1500వ సంవత్సరంలో కథ మొదలవుతుంది. స్త్రీ గొప్పా? పురుషుడు గొప్పా? అనే అశంపై టిట్ ఫర్ టాట్ లాంటి అంశాలతో కథ నడుస్తుంది. కొత్త కథ చెబితే ప్రేక్షకులు ఆదరిస్తారనే ధైర్యంతో ఈ సినిమా చేశాం’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. ఆయన హీరోగా రూపొందిన ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకుడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ నెల 4న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో శ్రీవిష్ణు విలేకరులతో ముచ్చటించారు. ‘నేను డ్యూయల్ రోల్స్ ఇప్పటివరకూ చేయలేదు. ఈ సినిమాలో నాలుగు పాత్రలు చేశాను. ఒకే పోలికతో ఉన్న నాలుగు జనరేషన్స్ వ్యక్తులుగా కనిపిస్తా. ఛాలెంజ్‌గా తీసుకొని ఈ పాత్రలు చేశా.
యూత్‌కే కాక, పెద్దవాళ్లకూ నచ్చే సినిమా ఇది. రెండున్నర గంటల్లో ఇంతపెద్ద కథ చెప్పారా? అంటూ సినిమా చూశాక దర్శకుడ్ని అభినందిస్తారు. నా కెరీర్లో వన్ ఆఫ్ ది టాప్ ఫిల్మ్ ‘స్వాగ్” అని తెలిపారు శ్రీవిష్ణు. కథానాయిక రీతూవర్మ ఇందులో కొత్తగా కనిపిస్తుందని, మీరాజాస్మిన్ అద్భుతంగా నటించారని, సినిమా చూస్తున్నంతసేపు నటులు కనిపించరని, పాత్రలే కనిపిస్తాయని, అందరికీ అర్థమయ్యేలా స్క్రీన్‌ప్లే ఉంటుందని, వివేక్‌సాగర్ మ్యూజిక్ క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని శ్రీవిష్ణు తెలిపారు. ఈ సినిమా తర్వాత ఓ థ్రిల్లర్ సినిమా, గీతా ఆర్ట్స్‌లో ఓ కామెడీ సినిమా చేస్తున్నామని శ్రీవిష్ణు చెప్పారు.