Sandhya Theater Stampede | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసును వెనక్కి తీసుకునేందుకు సుముఖంగానే ఉన్నానని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ వెల్లడించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. శ్రీతేజ్ గురించి అల్లు అర్జున్ రోజూ అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. శ్రీతేజ్ ఇప్పుడే కళ్లు తెరిచి చూస్తున్నాడని, కొడుకు ఎవరినీ గుర్తించట్లేదని చెప్పారు. మైత్రి మూవీస్ వారు రూ.50లక్షలు ఇచ్చారని, ప్రతీక్ ఫౌండేషన్ నుంచి కోమటిరెడ్డి రూ.25లక్షలు ఇచ్చారని పేర్కొన్నారు. అల్లు అర్జున్ రూ.10లక్షలు ఇచ్చారని భాస్కర్ తెలిపారు. సినీ పరిశ్రమ, అల్లు అర్జున్ నుంచి సానుకూలంగానే స్పందన వచ్చిందని, తాను కేసును వెనక్కి తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు వివరించారు. శ్రీతేజ్‌కు మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారని భాస్కర్ చెప్పుకొచ్చారు.
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో భాస్కర్ భార్య రేవతి మృతి చెందగా.. కొడుకు తీవ్ర గాయాలకు గురై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాట ఘటనపై భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో అల్లు అర్జున్‌తో పాటు పలువురిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. హైకోర్టును ఆశ్రయించగా.. ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. బెయిల్ పత్రాలు ఆలస్యంగా జైలు అధికారులకు అందడంతో ఆయన రాత్రి చంచల్‌గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది.