బయోపిక్, పీరియాడిక్ సినిమాల్లో నటించాలని ఉన్నదంటూ మనసులో మాట బయటపెట్టింది బాలీవుడ్ సీనియర్ నటి సోనాక్షి సిన్హా. ఎంతో సవాలుతో కూడుకున్న నిజజీవిత పాత్రలతోనే నటనా సామర్థ్యం బయటపడుతుందని చెప్పుకొచ్చింది. తాజాగా, ఓ జాతీయ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించింది. “నటనలో సరికొత్త సవాల్ విసురుతూ నన్ను విభిన్నంగా చూపించే పాత్రల కోసం చూస్తున్నా. అందుకే, కొన్నేళ్లుగా డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటున్నా. ఎందుకంటే, ఏదైనా కొత్తగా చేయడమంటేనే నాకు ఎంతో ఇష్టం. అదే ఎక్కువ ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది.
“నిజం చెప్పాలంటే నా కెరీర్లో లూటేరా, హీరామండి.. రెండే పీరియాడికల్ సినిమాలు. బయోపిక్ లేనేలేదు. అందుకే, ఎంతో సవాల్‌తో కూడిన నిజజీవిత పాత్రల్లో నటించాలని ఉంది” అంటూ తన మనసులో మాటను పంచుకున్నది. ఇక 2012లో అజయ్ దేవగన్ సరసన సోనాక్షి నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్’ హిట్ సినిమాగా నిలిచింది. తాజాగా దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘సన్ ఆఫ్ సర్దార్-2’లో తాను భాగం కాకపోవడంపైనా స్పందించింది. “ఈ సీక్వెల్ కొత్త పాత్రలతో, వేరే దిశలో సాగే కథ. అందుకే, నాకు ఆ సినిమాలో అవకాశం రాలేదు.
దర్శక నిర్మాతల నిర్ణయాన్ని నేను పూర్తిగా గౌరవిస్తా!” అంటూ చెప్పుకొచ్చింది సోనాక్షి. పరిశ్రమలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న ఒక ప్రొఫెషనల్‌గా.. ఇవన్నీ తాను అర్థం చేసుకుంటాననీ, సీక్వెల్లో అవకాశం రాకపోవడం తనను ఏమాత్రం ప్రభావితం చేయదనీ అంటున్నది. బాలీవుడ్ లెజెండరీ నటుడు శత్రుఘ్న సిన్హా వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చింది సోనాక్షి సిన్హా . ‘దబాంగ్’ చిత్రంతో తెరపై మెరిసి.. తొలి చిత్రంతోనే సక్సెస్ బాట పట్టింది. ఈ సినిమాతో బెస్ట్ డెబ్యూ ఆర్టిస్ట్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డునూ గెలుచుకుంది. ఆ తర్వాత రౌడీ రాథోడ్, సన్ ఆఫ్ సర్దార్, దబాంగ్ 2, హాలిడే లాంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. సుధీర్‌బాబు హీరోగా వెంకట్ కల్యాణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫాంటసీ చిత్రం.. ‘జఠాధర’తో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నది సోనాక్షి సిన్హా.