Smriti Mandhanas Fiance | భారత మహిళల క్రికెట్లో స్టార్ బ్యాటర్‌గా ఓ వెలుగు వెలుగుతుంది స్మృతి మంధాన. వరల్డ్ కప్ విజేత జట్టులో కీలక సభ్యురాలిగా ఉన్న స్మృతి మంధాన మరి కొద్ది రోజులలో జీవితంలోని కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. ఆమె తన ప్రియుడు, సంగీత దర్శకుడు, ఫిల్మ్‌మేకర్ పలాష్ ముచ్చల్‌ను వివాహం చేసుకోనుంది. ఈ నెల 23న వీరిద్దరి పెళ్లి జరగనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వరల్డ్ కప్ గెలిచిన అనంతరం, ట్రోఫీతో పాటు స్మృతి–పలాష్ కలిసి దిగిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫొటోను చూసిన అభిమానులు “స్మృతికి ఇదే బెస్ట్ ప్రీ–వెడ్డింగ్ గిఫ్ట్!” అంటూ అభినందనలు తెలియజేశారు. వీరి ప్రేమకథ 2019లో మొదలై, 2024 వరకు చాలా గోప్యంగానే కొనసాగింది.
అయితే పెళ్లికి ముందు స్మృతి తన స్నేహితులైన సహచర క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్‌లతో కలిసి ఒక ఫన్నీ వీడియోను విడుదల చేసింది. ‘లగే రహో మున్నాభాయ్’లోని ‘సమ్ఝో హో హీ గయా’ పాటకు అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. వీడియో చివర్లో స్మృతి తన ఎంగేజ్మెంట్ రింగ్‌ను చూపించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. వీరి . ప్రీ వెడ్డింగ్ వేడుకలు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, మంధాన స్వస్థలం అయిన మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగనున్నట్లు సమాచారం. మరోవైపు త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ఈ జంటకి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక లేఖ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. తన ప్రత్యేక సందేశంలో మోదీ కూడా.. నవంబర్ 23న పెళ్లి జరగనున్నట్లు పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉండాలని.. మంచి జీవితాన్ని నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.
అయితే స్మృతి చేసుకునే వ్యక్తి ఎవరా అని ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆరాలు తీస్తున్నారు. 30 ఏళ్ల పలాష్ ముచ్చల్ సంగీత దర్శకుడు, ఫిల్మ్‌మేకర్. ఆయన సోదరి పలక్ ముచ్చల్ బాలీవుడ్లో ప్రసిద్ధ గాయని. అభిషేక్ బచ్చన్–దీపికా పదుకొణె నటించిన ‘ఖేలే హమ్ జీ జాన్ సే’లో పలాష్ ముచ్చల్ నటించాడు. ప్రస్తుతం రాజ్‌పాల్ యాదవ్, రుబీనా దిలైక్ ప్రధాన పాత్రల్లో ‘అర్ధ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 1995లో ఇండోర్‌లో జన్మించిన పలాష్ . భారతీయ శాస్త్రీయ గాయకుడిగాను, విజయవంతమైన బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ గా కూడా గుర్తింపు పొందాడు. దిష్కియోన్ (2014), భూమి, తేరే బిన్ లాడెన్: డెడ్ ఆర్ అలైవ్ వంటి ప్రముఖ రచనలు చేశాడు. గాయకుడు పాలక్ ముచ్చల్ తమ్ముడే ఈ పలాష్ ముచ్చల్.