‘విద్య, వైద్యం వంటి మౌలిక సౌకర్యాలు డబ్బుతో సంబంధం లేకుండా అందరికి అంటుబాటులో ఉండాలన్నది ప్రపంచం మనకు నేర్పుతున్న పాఠం. ఇదే సమస్యను ఈ సినిమాలో చర్చించాం’ అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్. బుధవారం జరిగిన ‘సార్’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ధనుష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. సంయుక్త మీనన్ కథానాయిక. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘చదువు మనిషి జీవనశైలిని మార్చుతుంది. ఒక గుమస్తా కొడుకుని కలెక్టర్ చేయగలిగేది చదువు ఒక్కటే. మనిషి జీవితంలో గొప్ప ఆయుధమైన చదువుని డబ్బులేని కారణంగా దూరం చేయడం ఎంత వరకు సబబు అనే అంశాన్ని ఈ సినిమాలో చర్చించాం. మధ్యతరగతి కుటుంబాల వారు ఉన్నత చదువులకు వెళ్లాలంటే చదువు ప్రతి అడుగుకు దూరమైపోతున్నది. ఆర్థిక తారతమ్యాల వల్ల చదువుల మధ్య గీతలు గీస్తున్నం. ఇప్పుడు ఎల్కేజీ నుంచే చదువు దూరమైపోతున్నది. ఈ సీరియస్ అంశాన్ని దర్శకుడు వెంకీ బలంగా ప్రశ్నించాడు’ అని చెప్పారు.
‘తెలుగులో నా మొదటి సినిమా ఇది. భావోద్వేగాలతో పాటు సందేశం కలబోసి ఉంటుంది. ఇది మనందరి కథ, ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు’ అని ధనుష్ తెలిపారు. సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని, ఆన్లైన్లో ప్రీమియర్ షో టిక్కెట్లు కొద్ది సమయంలోనే మొత్తం బుక్ అయ్యాయని నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు. ఒక్క వీకెండ్ మాత్రమే కాదు..వరుసగా నాలుగు వీకెండ్స్ చూసేలా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు వెంకీ అట్లూరి అన్నారు. ప్రివ్యూ చూశాక సినిమా విజయంపై నమ్మకం రెట్టింపు అయిందని కథానాయిక సంయుక్త మీనన్ చెప్పింది. ఈ కార్యక్రమంలో సముద్రఖని, తమన్, సాయికుమార్, హైపర్ ఆది, రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.