భారతీయ సినీగీతానికి సరిగమలతో సొగబులద్దిన గాన సరస్వతి అనంతవిశ్వంలో ఐక్యమైంది. దశాబ్దాలపాటు తన గాన మాధుర్యంతో శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసిన స్వరం మూగబోయింది. పగలే వెన్నెల కురిపించిన ఆ గానం.. జగాన్నే ఊయలూగించిన ఆ గాత్రం ఇక మనకు వినిపించదు.. అవును.. దక్షిణభారత దిగ్గజ గాయని ఎస్.జానకి(88) భౌతికంగా ఇక లేరు. కొన్ని రోజులుగా వయోధిక సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు అప్సర విద్యుల ఇన్స్టా ద్వారా వెల్లడించారు. ఆమె మరణవార్తతో భారతీయ సినీలోకం నివ్వెరపోయింది. సంగీతప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలుగుబిడ్డగా పుట్టి, తమిళ, కన్నడ, మలయాళ భాషా ప్రేక్షకుల్ని సైతం తన గానామృతంలో ఓలలాడించారు ఎస్.జానకి. జానకి పలకలేని రాగం లేదు. పాడలేని గీతం లేదు. ఉచ్ఛరించలేని పదం లేదు. త్యాగరాజస్వామి సృష్టించిన మేళకర్త రాగాలన్నింటినీ ఔపోసన పట్టిన సంగీత సామ్రాజ్ఞి… సరిగమలతో నవరసాలనూ పలికించగల స్రష్ట ఎస్.జానకి. శాస్త్రీయం ఆలపిస్తే సరిగమలు మురిసిపోతాయి. పాశ్చాత్యం పాడితే పదాలు పల్లవిస్తాయి. విషాదమైనా, శృంగారమైనా, సంతోషమైనా, సంరంభమైనా ఆ గాత్రంలో నుంచి వెలువడితే పరవశించని మనసుండదు.. మనిషుండడు..
పి.సుశీల, జిక్కీ, లీల వంటి మహాగాయనీమణులు దక్షిణాది సినీసంగీతాన్ని శాసిస్తున్న సమయంలో ‘పగలే వెన్నెల జగమే ఊయల.. కదలే ఊహలకే కన్నులుంటే..’ అంటూ ‘పూజాఫలం’ సినిమాలో ఆమె ఆలపించిన గీతం శ్రోతల్ని శ్రవణానందభరితుల్నిచేసింది. భారతీయ సినిమాకు మరో దిగ్గజగాయని దొరికిందంటూ సంగీతలోకం హర్షం వెలిబుచ్చింది. ‘మురిపించే మువ్వలు’ చిత్రంలో ఆరుద్ర రాసిన ‘నీ లీల పాడెద దేవా.. ’ పాటను సంగీత దర్శకుడు ఎస్.ఎం.సుబ్బయ్యనాయుడు అప్పటి ప్రఖ్యాత గాయనీమణులతో పాడించాలని ప్రయత్నించారు. కానీ ఆ స్వరాలు పలకడానికి ఎవరూ సాహసించలేదు. కానీ జానకి అలవోకగా ఆలపించి, మేటి గాయనీమణులే నివ్వెరపోయేలా చేశారు. ఓ వందేండ్లు ఆ పాట అలా నిలిచే ఉంటుంది. నేటి ఔత్సాహిక గాయనీ మణులు సైతం ఈ పాట పాడేందుకు ప్రయత్నిస్తుండటం విశేషం. ఇక ‘బావామరదళ్లు’లో పెండ్యాల స్వరపరిచిన ‘నీలి మేఘాలలో.. గాలి కెరటాలలో..’ పాటకు తన గానంతో సొగబులద్దారు జానకి. ‘ఇద్దరు మొనగాళ్లు’ చిత్రంలో ఎస్పీ కోదండపాణి సంగీత దర్శకత్వంలో జేసుదాస్తో కలిసి ఆమె పాడిన ‘కొంగున కట్టేసుకోనా.. ఓ రాజా రాజా రాజా..’ పాట నేటికీ సంగీత ప్రియులకు ప్రియమైనదే.
పి.సుశీల ప్రభ ఓ స్థాయిలో వెలుగుతున్న తరుణంలో కథానాయికలకు పి.సుశీల పాడితే.. కొన్నాళ్ల పాటు వ్యాంపులకు, కమెడియన్లకు మాత్రమే ఎస్.జానకి పాటలు పాడేవారు. ఎంఎస్ విశ్వనాథన్, సత్యం, రాజన్-నాగేంద్ర, చక్రవర్తి, ఇళయరాజా వంటి సంగీత దర్శకుల ఆగమనంతో ఎస్.జానకి ప్రభంజనం దక్షిణభారతావనిలో మొదలైంది. ‘మరోచరిత్ర’ చిత్రంలో ‘పదహారేళ్లకూ.. నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు’ అని జానకి పాడుతుంటే అప్పటి టీనేజర్లు పరశించిపోయారు. ‘పదహారేళ్ల వయసు’లో ‘సిరిమల్లె పూవా..’ పాటకైతే నేటికీ వన్నె తగ్గలేదన్నది నిజం. జంధ్యాల ‘శ్రీవారి ప్రేమలేఖ’ చిత్రంలో ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు.. కలిగాయి మదిలోన ఎన్నెన్నో కథలూ..’ అంటూ వేటూరి సాహిత్యాన్ని జానకి పలికిన తీరు, ఆ పాటలో ఆమె పలికించిన విరహవేదన వర్ణించనలవికాదు. ‘స్వాతిముత్యం’ చిత్రంలో ‘మనసు పలికే మౌనగీతం’ పాటలో తన గాత్రంతో శృంగార నైషధాన్నే ఆవిష్కరించారు ఎస్.జానకి. ఇక ‘ఈ దుర్యోధన దుశ్యాసన దుర్వినీత లోకంలో..’ అంటూ ‘ప్రతిఘటన’ సినిమా కోసం వేటూరి కలం కథంతొక్కితే.. రౌద్ర, విషాద రసాలను ఏకకాలంలో పలికిస్తూ.. సమాజాన్ని ప్రశ్నిస్తూ.. జానకి ఆ పాట పాడిన తీరు నాటి తరానికే కాదు, నేటి తరానికీ ఓ పాఠమే.
జానకి నవ్వుతూ పాడగలరు. నవ్వునే పాటగా మార్చగలరు. అందుకు నిదర్శనం ‘జ్యోతి’ సినిమాలోని ‘సిరిమల్లె పూవల్లె నవ్వు.. చిన్నారి పాపల్లె నవ్వు’ ఈ పాటలోని సాహిత్యమంతా బాలూ పాడితే.. కేవలం నవ్వుతో పాటకు ప్రాణం పోశారు ఎస్.జానకి. ఇక చిరంజీవి ‘అభిలాష’ చిత్రంలో ‘నవ్వింది మల్లె చెండో.. నచ్చింది గాళ్ఫ్రెండూ’ పాట విషయంలోనూ అదే తంతు. జానకి నవ్వు లేకపోతే ఆ పాటకే అందం లేదు. జానకి అద్భుతమైన మిమిక్రీ కళాకారిణి కూడా. ‘సప్తపది’ చిత్రంలో ‘గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన’ పాటలో పిల్లాడి గొంతుతో ఆమె పలికిన ముద్దుముద్దు పదాలకు శ్రోతలు ముగ్థులయ్యారు. ఇక జంధ్యాల ‘శ్రీవారి శోభనం’ చిత్రంలో ‘అలకపానుపు ఎక్కనేలా..చిలిపి గోరింకా.. అలక చాలింకా..’ పాటలో వృద్ధురాలి గొంతుతో ‘సీతాకాలం సాయంకాలం..’ అంటూ వణుకుతూ జానకి పలికిన పలుకులు నేటికీ నవ్వు తెప్పించకమానవు. ‘సితార’ చిత్రంలో ‘కుకుకూ.. కుకుకూ.. కోకిల రావే..’ పాట సాహిత్యమంతా బాలూ పాడితే.. కేవలం కుకూలతోనే పాటకు అందాన్ని తెచ్చారు జానకి.
జానకి గాత్రానికి ఓ పరిధులంటూ లేవు. ఎలాంటి పాటైనా ఆ మహాగాయనికి కరతలామలకమే. డిస్కో పాటైనా, బ్రేక్డ్యాన్స్ పాటయినా.. విషాద గీతమైనా, విరహగీతమైనా జానకి గొంతు నుంచి వెలువడితే పరశించిపోవాల్సిందే. ‘ప్రియతమా.. నను పలకరించు ప్రణయమా..’ అంటూ ప్రియుడ్ని ఆర్తిగా పలకరింపజేసినా.. ‘ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిదీ..’ అంటూ ప్రకృతిని పులకరింపజేసినా అది జానకికే సాధ్యం. కాలాలు మారినా ఆమె గానం నలుదిక్కులా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.