Singer Kalpana | నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ప్రముఖ సింగర్ కల్పనకు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె స్పృహలోకి వచ్చారని పేర్కొన్నారు. అయితే, కల్పన ఆత్మహత్యాయత్నం వెనుక ఆమె రెండో భర్త ప్రసాద్ ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. సింగర్ కల్పన హైదరాబాద్ నిజాంపేట రోడ్డులోని ప్రీవిలేజ్ విల్లాస్‌లో నివాసం ఉంటున్నారు. రెండు రోజులుగా ఆమె ఇంటి తలుపులు తీయకపోవడంతో పక్క ఫ్లాట్ వారు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కల్పన ఇంటి తలుపులు తీసి లోపలికి వెళ్లగా కల్పన అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను సమీప హోలిస్టిక్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికీ పరిస్థితి విషమంగా ఉండటంతో క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.