‘నాకు మనశ్శాంతినిచ్చిన సినిమా ‘తెలుసు కదా’. ఈ విషయంలో డైరెక్టర్ నీరజకు థ్యాంక్స్ చెప్పాలి. నా ఆలోచనలను తీసుకొని ఈ కథలో గొప్పగా ఇంప్లిమెంట్ చేసింది తను. ఈ సినిమాను అందరూ రాడికల్ అంటున్నారు. మంచి ప్రొడక్ట్ కోసం డబ్బుకు అస్సలు వెనుకాడలేదు నిర్మాత విశ్వప్రసాద్. పనిచేసిన వారంతా మనసుపెట్టి పనిచేశారు.
ఈ సినిమా ప్రతీ ఒక్కరికి గుర్తుండిపోతుంది’ అని హీరో సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. ఆయన హీరోగా, రాశి ఖన్నా, శ్రీనిధిశెట్టి హీరోయిన్లుగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. నీరజ కోనా దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ సినిమా అప్రిషియేట్ మీట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు.
బండ్ల గణేశ్, కోన వెంకట్, ఎస్కేఎన్, డైరెక్టర్ సందీప్‌రాజ్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి అభినందనలు అందించారు. యునిక్ పాయింట్‌తో వచ్చిన ఓ కొత్త దర్శకురాలికి సిద్ధు అవకాశం ఇవ్వడం గొప్ప విషయమని, అందరూ ఈ సినిమాను అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అన్నారు. డెబ్యూ డైరెక్టర్‌గా తనని నమ్మి అవకాశం ఇచ్చిన హీరోకీ, నిర్మాతలకు దర్శకురాలు నీరజ కోన కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా వైవా హర్ష, గీత రచయితలు రామజోగయ్యశాస్త్రి, కాసర్లశ్యామ్, పంపిణీదారుడు శశిధర్‌రెడ్డి కూడా మాట్లాడారు.