భారతీయ సినిమాలో డ్రీమ్ డైరెక్టర్లనగానే ప్రముఖంగా వినిపించే పేర్లు.. మణిరత్నం, రాజమౌళి, సంజయ్‌లీలా భన్సాలీ, శంకర్. ఈ నలుగురి సినిమాల్లో నటించాలని హీరోహీరోయిన్లు పలవరిస్తుంటారు. ఇటీవల కమల్ ముద్దుల తనయ శ్రుతీహాసన్ కూడా తన కలల దర్శకుడి పేరు వెల్లడించారు. అయితే.. పైన పేర్కొన్న లిస్ట్‌లో ఆ దర్శకుడు లేడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారు? అతనే లోకేష్ కనకరాజ్. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో బాక్సాఫీస్ దుమ్ము దులిపిన లోకేష్ కనకరాజ్ తన డ్రీమ్ డైరెక్టర్ అని శ్రుతీ హాసన్ చెప్పారు.
ఆయన దర్శకత్వంలో నటించాలనేది తన కల అని. ఆ కల ‘కూలీ’ సినిమాతో నెరవేరినందుకు సంతోషంగా ఉందని శ్రుతీహాసన్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ ‘విక్రమ్’ సినిమా చూసినప్పుడు నేను పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. అప్పాని నేను ఎలా చూడాలనుకున్నానో.. ఆ సినిమాలో అలా కనిపించారు. అప్పాను హ్యాండిల్ చేయడం ఇప్పటి దర్శకులకు కష్టమైపోతున్నదని బాధ పడేదాన్ని.
‘విక్రమ్’తో ఆ బాధ తీరిపోయింది. రాబోతున్న ‘కూలీ’లో రజనీ అంకుల్ కొత్త అవతారాన్ని చూస్తారు. ఇందులో నా పాత్ర గురించి నేను మాట్లాడను.. అది సస్పెన్స్..’ అంటూ చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్. నిజానికి ‘కూలీ’ కంటే ముందు లోకేష్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ యాడ్ షూట్లో నటించారు శ్రుతిహాసన్. ఆ యాడ్ షూట్ తర్వాత వారిద్దరూ రిలేషన్లో ఉన్నట్టు వార్తలు కూడా వచ్చాయి.