Shreyas Talpade | ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన భారీ పెట్టుబడి మోసం కేసులో ప్రముఖ బాలీవుడ్ నటులు శ్రేయస్ తల్పడే, అలోక్ నాథ్ ఇరుక్కుపోయారు. ఈ కేసులో వీరిద్దరితో పాటు మరో 22 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ‘అర్బన్ మల్టీ-స్టేట్ క్రెడిట్ అండ్ థ్రిఫ్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ’ పేరిట జరిగిన ఈ మోసంలో ఇద్దరు నటులు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. భాగ్పత్కు చెందిన బబ్లీ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
ఈ సొసైటీ ఏజెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల వద్ద నుండి డిపాజిట్లు సేకరించారు. పెట్టుబడిపై భారీ లాభాలు వస్తాయి, పెట్టిన డబ్బు రెట్టింపవుతుంది అంటూ నమ్మబలికారు. ప్రముఖ నటులు ఈ సంస్థకు ప్రచారం చేయడంతో ప్రజలు మరింత నమ్మకం కలిగి లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సుమారు 500 మంది పెట్టుబడిదారుల వద్ద నుండి రూ.5 కోట్లకు పైగా సొమ్ము వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
2024 నవంబర్‌లో ఈ సొసైటీ తన పేమెంట్ గేట్‌వేను అకస్మాత్తుగా నిలిపివేయడంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందారు. గడువు ముగిసినా డబ్బు తిరిగి రాకపోవడంతో వారు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. 2025 మార్చి 3న సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (CRCS) ఈ సంస్థ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి లిక్విడేట్ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే 2023 ఆగస్టులోనే సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసినా, సరైన స్పందన రాలేదని అధికారులు తెలిపారు.
ఈ కేసులో ఈ ఏడాది జూలైలో సుప్రీంకోర్టు శ్రేయస్ తల్పడేకు అరెస్ట్ నుంచి తాత్కాలిక మినహాయింపు కల్పించింది.తాజా ఎఫ్ఐఆర్లో నటులతో పాటు హరియాణా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, లక్నో, ముంబై ప్రాంతాలకు చెందిన పలు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, రీజనల్ మేనేజర్లు, మార్కెటింగ్ ఏజెంట్లు పేర్లు కూడా చేర్చబడ్డాయి. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.అధికారుల సమాచారం ప్రకారం, నటులు నేరుగా ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనకపోయినా, బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నందునే కేసులో వారి పేర్లు చేర్చినట్లు తెలుస్తోంది.