తెలంగాణ విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలా నిలిచే పూలపండగ బతుకమ్మ గురించి యువ కథానాయిక శివాని నాగరం ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో ఈ భామ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బతుకమ్మ పండగతో తనకున్న అనుబంధం, చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంది.
నా చిన్నతనంలో మా కుటుంబం చిక్కడపల్లిలో ఉండేది. బతుకమ్మ పండగ రోజుల్లో ఉదయం లేవగానే పూలు, మామిడి ఆకులు తీసుకురావడానికి మార్కెట్‌కు వెళ్లేవాళ్లం. సాయంత్రం అమ్మ, నానమ్మతో కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చేవాళ్లం. బతుకమ్మ పండగ తాలూకు సంప్రదాయాలు, పాటలు, పండగ వేళ తయారుచేసే పిండివంటలు నాకు చాలా ఇష్టం. అందుకే పండగలన్నింటిలో బతుకమ్మను ప్రత్యేకంగా భావిస్తా.
ఈ ఏడాది షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల తొలిరోజు బతుకమ్మ వేడుకలో పాలుపంచుకోలేకపోయా. సద్దుల బతుకమ్మను మాత్రం అస్సలు మిస్ చేయను. ఆ రోజు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. బతుకమ్మ తొమ్మిది రోజుల్లో మా ఇంట్లో అమ్మవారిని వివిధ ఆభరణాలు, చీరలతో అలంకరిస్తాం.
బతుకమ్మ ప్రసాదాల్లో అన్నం, బెల్లంతో చేసే పరమాన్నం అంటే నాకు చాలా ఇష్టం. సద్దుల బతుకమ్మ రోజు అమ్మమ్మ, తాతయ్యతో పాటు కజిన్స్ అందరూ మా ఇంటికే వస్తారు. ఆ రోజు పొందే ఆనందమే వేరు. మా కుటుంబమంతా కలుసుకునే రోజు కాబట్టి సద్దుల బతుకమ్మను చాలా స్పెషల్‌గా భావిస్తాను. ఈ తొమ్మిరోజుల పాటు చేసే దుర్గాదేవి ఆరాధన కష్టాలను అధిగమించే మనోధైర్యాన్ని, సకల శుభాలను అందిస్తుందని నేను బలంగా విశ్వసిస్తాను.