‘ఈ సినిమా కథ ముందుగా నేనే విన్నా. వెంటనే అడ్వాన్స్ ఇచ్చేశా. అంతగా నచ్చింది. ఆ తర్వాత అశ్విన్ దగ్గరకు తీసుకెళ్లా. ఆయన అయిదు నిమిషాల్లో ఓకే చేశారు. ఇది నిజంగా అద్భుతమైన కథ. ఇందులో చాలా లేయర్లు ఉంటాయి. ఇది ఒక జానర్ అని చెప్పడానికి లేదు. ఇందులో ఆయిదారు జానర్లుంటాయి. అందరినీ ఆకట్టుకునే అంశాలుంటాయి. ట్విస్టులు ఉంటాయి. క్వాలిటీ కంటెంట్ కోసం అనుకున్న దానికంటే కాస్త ఎక్కువే ఖర్చు చేశాను.’ అని నిర్మాత మహేశ్వర్‌రెడ్డి మూలి అన్నారు.
అశ్విన్‌బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘శివంభజే’. దిగంగనా సూర్యవంశీ కథానాయిక. ఈ సినిమా ఆగస్ట్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం మహేశ్వర్‌రెడ్డి విలేకరులతో ముచ్చటించారు. ‘ఆగస్ట్ 1 నా పుట్టినరోజు. అలాగే హీరో అశ్విన్‌బాబు పుట్టినరోజు కూడా. ఈ కారణంగా ఈ డేట్‌ని ఫిక్స్ చేయలేదు. నేను పంపిణీదారుడ్ని కూడా కావడంతో అన్ని విధాలుగా ఆలోచించి ఈ డేట్‌ని ఫిక్స్ చేశాను.
ఇక మున్ముందు మా సంస్థ నుంచి పెద్ద సినిమాలు రాబోతున్నాయి.’ అని తెలిపారు మహేశ్వర్‌రెడ్డి. మ్యూజిక్కే ఈ సినిమాకు హీరో అని, సంగీత దర్శకుడు వికాస్ అద్భుతమైన సంగీతం ఇచ్చారని, ఆర్.ఆర్.తో సినిమాకు ప్రాణం పోశారని ఆయన తెలిపారు. అగ్రహీరో వెంకటేశ్ ఈ సినిమా ట్రైలర్ చూసి అభినందించారని, త్వరలో ‘ఐఐటీ కృష్ణమూర్తి’ టీమ్‌తో ఒక సినిమా. కార్తికేయతో ఒక సినిమా చేయాలనుకుంటున్నామని మహేశ్వర్‌రెడ్డి చెప్పారు.