‘ఈ సినిమాలో నా పాత్ర భిన్నంగా ఉంటుంది. చూసే ప్రేక్షకుడికి ‘వీడు మంచోడా? చెడ్డోడా?’ అనే అనుమానం వస్తుంది. ఇందులో నేను వ్యవసాయదారుడిగా కనిపిస్తా. ఈ సినిమాలోని అన్ని పాత్రలూ నా చుట్టూనే తిరుగుతాయి. అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర నాది’ అని తెలిపారు నటుడు శివాజీ. ఆయన ప్రధానపాత్ర పోషించిన చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ నిర్మాత. ఈ నెల 25న సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా మంగళవారం శివాజీ విలేకరులతో మాట్లాడారు. ‘అన్ని రకాల భావావేశాలూ ఉన్న సినిమా ‘దండోరా’. ఇందులో గొప్ప కథనం ఉంటుంది. ‘కోర్ట్’ సినిమాలో మంగపతి పాత్రకు ఎంత స్పందన వచ్చిందో అంతే స్పందన ‘దండోరా’లోని పాత్రకు కూడా వస్తుంది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర నాది. బిందుమాధవి, నవదీప్, నందు, రవికృష్ణ అందరూ అద్భుతంగా నటించారు.
సాంకేతికంగా కూడా సినిమా బావుంటుంది.’ అని శివాజీ చెప్పారు. ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ అనే సినిమా చేశానని, త్వరలోనే ఆ సినిమా రానున్నదని, అలాగే ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ‘ఎపిక్’ సినిమా అద్భుతంగా ప్రతి ఫ్యామిలీ కనెక్టయ్యేలా ఉంటుందని శివాజీ పేర్కొన్నారు.