Shilpa Shetty | బాలీవుడ్ నటి శిల్పా శెట్టి మరియు ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పెట్టుబడి పేరుతో భారీ మొత్తంలో మోసం చేశారన్న ఆరోపణలపై ముంబై పోలీసులు వీరి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కేసును ప్రస్తుతం ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) దర్యాప్తు చేస్తుంది. వివరాలలోకి వెళితే ముంబైకి చెందిన వ్యాపారి, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారీ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. 2015 నుంచి 2023 మధ్య కాలంలో వ్యాపార విస్తరణ పేరుతో శిల్పా దంపతులు తమ వద్ద రూ. 60.4 కోట్లు తీసుకున్నారని, కానీ ఆ డబ్బును తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కొఠారీ వివరాల ప్రకారం, రాజేశ్ ఆర్య అనే వ్యక్తి ద్వారా తాను శిల్పా-రాజ్ దంపతులను కలిశారట. ఆ సమయంలో వారు ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే హోమ్ షాపింగ్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారని, దాదాపు 87.6% వాటా వారిదేనని తెలిపారు. మొదట వీరు 12% వడ్డీతో రూ. 75 కోట్ల రుణం కావాలని అడిగారని, కానీ ఆ మొత్తం పన్నుల భారం లేకుండా పెట్టుబడిగా మారుస్తే మంచిదని ఒప్పించారని ఆయన వివరించారు. ఈ క్రమంలో కొఠారీ, 2015లో రెండు విడతల్లో రూ. 31.9 కోట్లు, రూ. 28.53 కోట్లు బదిలీ చేశారు. 2016లో శిల్పా శెట్టి వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చినా, అదే ఏడాది ఆమె డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం, 2017లో మరో ఒప్పందం విఫలమవడంతో కంపెనీ దివాళా ప్రక్రియలోకి వెళ్లినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు.
దీపక్ కొఠారీ ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించి, మోసం, నమ్మకద్రోహం తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోసం మొత్తం రూ. 10 కోట్లకు పైగా ఉండటంతో, కేసును జుహు పోలీస్ స్టేషన్ నుంచి ఆర్థిక నేరాల విభాగానికి (EOW) బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. ఈ కేసు నేపథ్యంలో శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా దంపతులు మరోసారి హెడ్ లైన్లో నిలిచారు. గతంలోనూ వివాదాల పాలైన రాజ్ కుంద్రా, ఇప్పుడు పెట్టుబడిదారుడి ఫిర్యాదు వల్ల మళ్లీ చర్చలోకి వచ్చారు. ఈ కేసులో విచారణ ఎటు వైపు పోతుందనేది ఆసక్తికరంగా మారింది.