Shilpa Shetty | ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేరకు మోసం కేసు (cheating case)లో బాలీవుడ్ స్టార్ నటి శిల్పాశెట్టి (Shilpa Shetty), ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా (Raj Kundra) నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి శిల్పా శెట్టిని ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (Mumbai Police’s Economic Offences Wing) నిన్న విచారించింది.
సోమవారం శిల్పా శెట్టి ఇంటికి వెళ్లిన అధికారులు.. దాదాపు నాలుగున్నర గంటలపాటూ ప్రశ్నించినట్లు తెలిసింది. బ్యాంకు లావాదేవీల గురించి ఆరా తీసినట్లు సమాచారం. విచారణ సందర్భంగా శిల్పా శెట్టి నుంచి కీలక విషయాలను రాబట్టినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. విచారణ సందర్భంగా ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం శిల్పా శెట్టి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. విచారణ సందర్భంగా పలు పత్రాలను నటి అందజేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఇదే కేసులో గతనెల రాజ్ కుంద్రాను పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. దాదాపు 5 గంటల పాటూ ఆయన్ని విచారించిన పోలీసులు.. ఆయన వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు.
శిల్పా శెట్టి దంపతులు రూ.60 కోట్ల మోసానికి పాల్పడినట్లు ముంబై వ్యాపారవేత్త దీపక్ కొఠారీ ఇటీవలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన కంపెనీ 2015 నుంచి 2023 వరకు రుణం, పెట్టుబడి రూపంలో రూ.60.4 కోట్లను ఈ దంపతులకు ఇచ్చిందని తెలిపారు. ఈ సొమ్మును వీరు తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు. రాజేశ్ ఆర్య అనే వ్యక్తి ద్వారా తాను శిల్పా-రాజ్ దంపతులను కలిసినట్లు పిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో వారు ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే హోమ్ షాపింగ్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులోని బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రస్తుతం మూతపడింది.
దీపక్ కొఠారీ ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించి, మోసం, నమ్మకద్రోహం తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోసం మొత్తం రూ. 10 కోట్లకు పైగా ఉండటంతో, కేసును జుహు పోలీస్ స్టేషన్ నుంచి ఆర్థిక నేరాల విభాగానికి (EOW) బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. కేసు విచారణ సమయంలో దేశం విడిచిపోకుండా ఉండేందుకు శిల్పా దంపతులపై ఆర్థిక నేరాల విభాగం (EOW) అధికారులు ఇటీవలే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.
Also Read..
Arvind Kejriwal | ఎట్టకేలకు కేజ్రీవాల్‌కు ప్రభుత్వ నివాసం కేటాయింపు
Bihar Elections | బీహార్‌లో బీజేపీ ఎన్నికల వ్యూహం.. ఫేమస్ సింగర్‌ను బరిలోకి దింపనున్న కమలదళం
పిల్లలు గుహలో ఉంటే మీరేం చేస్తున్నట్లు?