బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన నానమ్మ వృద్ధాప్యంలోనూ ఎంతో అందంగా ఉండేదని, ఆమె సౌందర్య రహస్యం ఏమిటి అన్నది ఇటీవల మీడియాతో పంచుకుంది. ‘94 ఏండ్ల వయసులో చనిపోయేనాటికి కేవలం ఓ మూడు నాలుగు గీతలు ఆమె ముఖం మీద కనిపించేవి అంతే…’ అంటూ తన నానమ్మను గుర్తు చేసుకుంది. తన సౌందర్య పోషణ విషయంలోనూ అమ్మానాన్నలతోపాటు ఆమె ముద్ర కూడా ఉందని చెప్పింది. ‘నేను ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. నాన్న సహా అందరూ తమ శరీరం పట్ల శ్రద్ధ తీసుకునేవారే. మా ఇంట్లో ఒంటిని శుభ్రం చేసుకునేందుకు రకరకాల పిండ్లు, పసుపు, పెరుగుల మిశ్రమాన్ని ఉపయోగించేవారు.
ఇది ఇప్పటికీ నేను కూడా వాడతాను. ఇక, మా నానమ్మ సౌందర్య రహస్యమైతే ట్యూబుల్లోనో, డబ్బాల్లోనో కాదు, నూనె సీసాలో ఉండేది. ఆమె తరచూ ఒళ్లంతా కొబ్బరినూనె రాసుకునేది. తొంభైల్లోనూ ఆమె ముఖం మీద ముడతలు కనిపించకపోవడానికి ఇదే కారణమని అనుకుంటా’ అని సింపుల్ బ్యూటీ హ్యాక్‌ను పంచుకుంది. చర్మ సౌందర్యం కోసం పది అంచెల బ్యూటీ రొటీన్లు, మిరాకిల్ క్రీమ్‌ల లాంటివి వాడుతున్న ఈ సమయంలో ఇలాంటి చిట్కాలు నిజంగా ఆసక్తికరంగానే కనిపిస్తాయి.