Ilaiyaraaja | ‘ఈ సినిమా కోసం నేనిచ్చిన ట్యూన్‌కి కీరవాణి పాట రాశారు. తను రాసిన పాట పల్లవి విన్నప్పుడు.. తన మనసులో నాపై ఉన్న అభిమానాన్నీ, ఆత్మబంధాన్నీ క్రోడీకరించి రాశారనిపించింది. సంగీత దర్శకుడు కావడానికి ముందూ, అయిన తర్వాత కూడా నాపై ఆయనకున్న అభిమానం అలాగే ఉంది.’ అన్నారు సంగీత దర్శకుడు ఇళయరాజా. రూపేష్, ఆకాంక్షాసింగ్ జంటగా.. ‘లేడీస్ టైలర్’ఫేం రాజేంద్రప్రసాద్, అర్చన మరో జంటగా రూపొందిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్‌ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఇళయరాజా మాట్లాడారు.
ఇంకా చెబుతూ ‘ఈ సినిమాకు నేను చేసిన స్వరాలలో కొన్నింటిని మీరు విన్నారు. వినబోతున్నారు. వింటూనే ఉంటారు. ఇది నమ్మకంతో చెబుతున్నమాట. నేను చేసిన వేలాది పాటల్లో నాకు నచ్చినపాట ఏదని అడిగితే.. ఒకటా రెండా?! నాకు ఎంత సంగీతం తెలుసన్నది ఇక్కడ ముఖ్యంకాదు. సంగీతమే నా గురించి తెలుసుకుంది. నాలోంచి సంగీతం ఎలా వస్తుందో నాకే తెలీదు. ఎప్పటికీ తెలియకూడదని దేవుడ్ని కోరుకుంటున్నా. తెలిసిన మరుక్షణం నేను సంగీతాన్ని ఆపేస్తాను. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ దేవుడి ఆశీస్సులు ఉండాలి.’ అని ఇళయరాజా పేర్కొన్నారు.
ఇళయరాజా సంగీతం వల్లే తాను హీరోగా నిలబడ్డానని రాజేంద్రప్రసాద్ గుర్తుచేసుకున్నారు. కీరవాణి మాట్లాడుతూ ‘ ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం.. నీదో, నీవల్ల నాదో ఈ పరవశం.. రాగం నీదై.. పల్లవి నాదై.. చరణం చరణం కలిసిన వేళ పయనాలు ఏ హిమాలయాలతో..’ ఇది ఈ సినిమా కోసం రాజాసార్ ఇచ్చిన ట్యూన్‌కి నేను రాసిన పల్లవి. సినిమాలోని ఈ పాట సందర్భాన్నీ, నా జీవితాన్నీ రెండింటినీ ముడిపెట్టి ఈ పల్లవి రాశా. నేను రాజాగారి వీరాభిమానిని. ఆయన సంగీతంలో పాడాలనేది నా కోరిక. కానీ పాట రాసే మహద్భాగ్యం కలిగింది.’ అని ఆనందం వెలిబుచ్చారు. ఇంకా చిత్ర బృందం అంతా మాట్లాడారు.