‘ప్రస్తుతం విలువలతో కూడిన సినిమాలు రావడం తగ్గిపోయింది. ఈ కథలోని కుటుంబ భావోద్వేగాలు కట్టిపడేశాయి. ఇందులోని ప్రతీ పాత్రకు ప్రేక్షకులు వ్యక్తిగతంగా కనెక్ట్ అవుతారు’ అన్నారు రూపేశ్. స్వీయ నిర్మాణంలో ఆయన హీరోగా నటించిన ‘షష్టిపూర్తి’ చిత్రం ఈ నెల 30న విడుదలకానుంది. రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించారు. పవన్‌ప్రభ దర్శకుడు. ఈ సందర్భంగా మంగళవారం హీరో, నిర్మాత రూపేశ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. సినిమాలో స్వచ్ఛమైన ప్రేమను, కుటుంబ అనుబంధాల ఔన్నత్యాన్ని చూపిస్తున్నామన్నారు.
‘ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కొడుకుగా కొత్త నటుడైతే బాగుటుంది..ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూస్తారని దర్శకుడు భావించారు. దాంతో నేను ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటరయ్యాను’ అన్నారు. ఇళయరాజా, తోట తరణి వంటి లెజెండ్స్ ఈ సినిమా కోసం పనిచేశారని, ఇళయరాజా మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచిందని తెలిపారు. ‘కథాబలం ఉంది కాబట్టే పెద్ద టెక్నీషియన్స్ ఈ సినిమాలో భాగమయ్యారు. కీరవాణిగారు అడిగిన వెంటనే పాట రాసిచ్చారు. ఈ సినిమాలో అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. ఇలాంటి సెన్సిబుల్ స్టోరీ ఇటీవలకాలంలో రాలేదు. రెండు రాష్ర్టాల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం’ అన్నారు.