Shahrukh Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌ను ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. షారుక్ శుక్రవారం రాత్రి షార్జా నుంచి వచ్చినట్లు విమానాశ్రయంలో ఉన్న ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) వర్గాలు తెలిపాయి. అతడి వద్ద ఖరీదైన వాచీలు, వాటి కవర్లు ఉన్నాయి. ఈ వాచీల కోసం షారుక్ రూ.6.83 లక్షల కస్టమ్ డ్యూటీ చెల్లించాల్సి వచ్చింది. యూఏఈలోని ఎక్స్పో సెంటర్లో నిర్వహిస్తున్న గ్లోబల్ సినిమా ఐకాన్, కల్చరల్ నరేటివ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి శనివారం షారుఖ్ ఖాన్ దుబాయ్ వెళ్లారు.
షారుక్ ఖాన్ శుక్రవారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో ముంబై ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. షారుఖ్ ఖాన్, అతడి బృందాన్ని టీ-3 టెర్మినల్ వద్ద రెడ్ ఛానల్ దాటుతుండగా కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. షారుఖ్ ఖాన్ బ్యాగుని సిబ్బంది తనిఖీ చేశారు. బ్యాగులో Baubn & Zurbk వాచీలు, 6 బాక్సుల రోలెక్స్ వాచీలు, స్పిరిట్ బ్రాండ్ వాచీలు, Apple సిరీస్ వాచీలు లభించాయి. వీటితో పాటు వాచీల ఖాళీ పెట్టెలు కూడా ఉన్నాయి.
విమానాశ్రయంలో దాదాపు గంటపాటు ఆపరేషన్ తర్వాత షారుక్, అతడి మేనేజర్ పూజా దద్లానీని కస్టమ్స్ అధికారులు విడిచిపెట్టారు. అయితే షారుఖ్ బాడీగార్డ్ రవితోపాటు మిగిలిన టీమ్‌ను అడ్డుకున్నారు. షారుఖ్ బాడీగార్డ్ రవి కస్టమ్ డ్యూటీ రూ.6.87 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఉదయం 8 గంటలకు ప్రక్రియ పూర్తయిన తర్వాత బాడీగార్డ్ రవిని పంపించేశారు. జరిమానా మొత్తాన్ని షారుక్ క్రెడిట్ కార్డు నుంచే చెల్లించినట్లు ఎయిర్ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తున్నది.