Shahid Kapoor | బాలీవుడ్ స్టార్ నటుడు షాహిద్ కపూర్ తన కెరీర్లోనే అత్యధిక పారితోషికాన్ని అందుకోబోతున్నట్లు తెలుస్తుంది. రాజ్ & డీకే దర్శకత్వంలో రాబోతున్న పాపులర్ వెబ్ సిరీస్ ‘ఫర్జీ’ యొక్క రెండవ సీజన్ కోసం షాహిద్ ఏకంగా ₹45 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.
‘ఫర్జీ 2’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుడగా.. ఈ సీజన్లో షాహిద్ పాత్ర కోసం నిర్మాతలు భారీ మొత్తం చెల్లించడానికి సిద్ధమయ్యారు. దీంతో షాహిద్ కపూర్ బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో చేరనున్నారు. సాధారణంగా షాహిద్ ఒక్కో సినిమాకు ₹25 నుంచి ₹30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, ‘ఫర్జీ’ మొదటి సీజన్ 2023లో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ థ్రిల్లర్లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి మధ్య సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఒక కళాకారుడు డబ్బు కోసం నకిలీ నోట్లు తయారు చేయడం మొదలుపెట్టి ఎలా చిక్కుల్లో పడతాడనేది ఈ సిరీస్ కథాంశం. ఇందులో కే కే మీనన్, రాశి ఖన్నా, భువన్ అరోరా కూడా ముఖ్య పాత్రలు పోషించారు. 2023లో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్లలో ‘ఫర్జీ’ ఒకటిగా నిలిచింది.