PM Modi : దీపావళి పండుగ (Diwali fest) సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఓ లేఖ రాశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) కు శ్రీరాముడే స్ఫూర్తి అన్నారు. ఈ ఆపరేషన్ భారత ధర్మాన్ని కాపాడటంతో పాటు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుందని పేర్కొన్నారు.
‘అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత ఇది రెండో దీపావళి. ధర్మాన్ని కాపాడాలని శ్రీరాముడు మనకు బోధించాడు. అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. కొన్ని నెలల క్రితం మనం చేపట్టిన ఆపరేషన్ సింధూరే ఇందుకు ఉదాహరణ. మనం భారత ధర్మాన్ని కాపాడటంతోపాటు ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. ఈ దీపావళికి మరో ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన అనేక జిల్లాలతోపాటు మారుమూల ప్రాంతాల్లో కూడా దీపావళి వెలుగులు నిండాయి. మన దేశ రాజ్యాంగంపై విశ్వాసంతో అనేక మంది హింసా మార్గాన్ని విడిచిపెట్టి జన జీవన స్రవంతిలోకి వస్తున్నారు. దేశానికి ఇది ఒక గొప్ప విజయం’ అని లేఖలో రాసుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గించిన విషయాన్ని కూడా ఆయన తన పోస్టులో ప్రస్తావించారు. ఈ జీఎస్టీ రేట్ల తగ్గింపు కారణంగా ప్రజలకు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరుతుందన్నారు. ఇక పౌరులు స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అన్ని భాషలను గౌరవించాలని సూచించారు. ప్రతిఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని కోరారు. మనం తీసుకునే ఆహారంలో నూనె వాడకాన్ని 10 శాతం తగ్గించి యోగాను ఆచరిద్దామని పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నాలన్నీ మనలను వికసిత్ భారత్ వైపు నడిపిస్తాయని చెప్పారు.